ముంబై: ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు భారీ అమ్మకాల ఒత్తిడితో బుధవారం రికార్డుస్థాయి కంటే దిగువకు పడిపోయాయి. ప్రాఫిట్ బుకింగ్ మధ్య మెటల్, ఆటో ఐటి స్టాక్‌లలో భారీ నష్టాలు వచ్చాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుపై పెరుగుతున్న అనిశ్చితి కూడా దేశీయ ఈక్విటీలలో బలహీనమైన ధోరణికి కారణమయింది. 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 129.72 పాయింట్లు లాభపడి 80,481.36 వద్ద తాజా ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది.
అయితే, ఇండెక్స్ ఇంట్రాడేలో 915.88 పాయింట్లు పడిపోయి 79,435.76 వద్దకు పడింది. చివరకు 426.87 పాయింట్లు తగ్గి 79,924.77 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఓపెనింగ్ డీల్స్‌లో దాని రికార్డు 24,461.05ను తాకింది. చివరికి108.75 పాయింట్లు క్షీణించి 24,324.45 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ప్యాక్‌లో టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితరాలు నష్టపోయాయి.
మరోవైపు ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో నిలిచాయి. బీఎస్‌ఈలో మొత్తం 2,574 స్టాక్‌లు క్షీణించగా, 1,365 పెరిగాయి. మిగతా 82 మారలేదు. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 0.69 శాతం క్షీణించగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం క్షీణించింది. హెల్త్‌కేర్, యుటిలిటీస్, పవర్ మినహా అన్ని సూచీలూ నష్టపోయాయి.