- 17న స్వామి కళ్యాణ మహోత్సవం
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో దొంగ మల్లన్న జాతర ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఏటా మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత నిర్వహించే ఈ జాతరకు ఉమ్మడి కరీంనగర్‌తోపాటు వరంగల్, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
డిసెంబర్నెలలో ప్రతి ఆదివారం, బుధవారం ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినట్లు వాదనలు ఉన్నాయి. మరోవైపు 15, 16వ శతాబ్దాల్లో వెలమదొరలు, తంబీరులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. మల్లన్న స్వామి జాతరకు వచ్చే భక్తులు పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు.
ఈ నెల 17 న రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం, 18న దండి వారం, 20న నాగవల్లి, పెద్దపట్నం తో పాటు అగ్నిగుండాలు నిర్వహిస్తారు. చివరి రోజు జనవరి 11న గురువారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పూజలు నిర్వహించనున్నారు.