కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్​ సిటీ, వెలుగు: దేశ స్వాతంత్రోద్యమంలో ప్రజలను చైతన్య పరిచిన ఘనత కళాకారులకే దక్కుతుందని మానకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమాన్ని కరీంనగర్ లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రారంభించారు. అనంతరం టీఎస్ఎస్ కళాకారులు, చిందు యక్షగానం, ఒగ్గు, కోలాటం, అమరవీల స్థూపం నుంచి కలెక్టరేట్ ఆడిటోరియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు స్వరాజ్యం కోసం కళాకారులు ప్రజలను ఎలా జాగృతం చేశారో,  అలాగే సాంస్కృతిక కళాకారులు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనలో భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ సాధన కోసం అసువులు బాసిన శ్రీకాంతాచారి, యాదయ్య తదితర తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుందామని అన్నారు. తెలంగాణలో 570 మంది సాంస్కృతిక కళాకారులకు ఉద్యోగం కల్పించి, ప్రభుత్వంలో భాగస్వాములను చేశామన్నారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్, సీపీ సత్యనారాయణ, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణా రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని చంపి ఎన్నికలు తెస్తుండ్రు

కరీంనగర్‍ టౌన్, తిమ్మాపూర్, వెలుగు: ఎవరైనా అనుకోకుండా చనిపోతే రావాల్సిన ఉప ఎన్నికను ప్రజాస్వామ్యాన్ని చంపి తీసుకొస్తున్నరని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఆదివారం శ్రీరాములపల్లిలో మొదలైన పాదయాత్ర కమాన్ పూర్ మీదుగా కరీంనగర్ చేరింది. ఈ సందర్భంగా స్థానిక డీసీసీ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాగా పేరుగాంచిన అలుగునూర్ చౌరస్తాను కేసీఆర్ చౌరస్తాగా మార్చడం సిగ్గుచేటని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచి అచ్ఛేదిన్ అని ఎలా అంటారని ప్రధానిపై మండిపడ్డారు. బండి సంజయ్ నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి టెంపుల్ చుట్టూ తిరుగుతున్నడని, కరీంనగర్ ప్రజలకు కనిపించకుండా పోయాడని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఆది శ్రీనివాస్, అల్గిరెడ్డి ప్రవీణ్‍రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

చదువుకు పేదరికం అడ్డు కాకూడదు

స్టూడెంట్లకు మెరిట్ బహుమతులు ఇచ్చిన మంత్రి గంగుల

కరీంనగర్‍ టౌన్, వెలుగు: చదువుకునే విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గవర్నమెంట్​స్కూల్స్​లో చదివి 10 జీపీఏ సాధించిన 32 మంది విద్యార్థులకు ఆయన మెరిట్ బహుమతులు ఇచ్చారు. వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ తోపాటు సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్టూడెంట్లు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, నందెల్లి మహిపాల్, కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, డీఈఓ జనార్దన్ రావు, డాక్టర్ రఘురాం, అజయ్ ఖండాల్, వెంకట్ ఫౌండేషన్ అధ్యక్షులు గంప వెంకట్, హరీశ్ పాల్గొన్నారు. 

18న బీజేపీ బహిరంగ సభ

కోరుట్ల, వెలుగు: స్థానిక కాలేజీ గ్రౌండ్ లో ఆగస్టు 18న నిర్వహించే బీజేపీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ కోరుట్ల నియోజకవర్గ ఇన్​చార్జి వెంకట్ పిలుపునిచ్చారు. ఆదివారం కోరుట్లలోని కావేరి గార్డెన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ కు ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ ఇన్​చార్జి తరుణ్ చుగ్, ఎంపీ అరవింద్, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యే లు పాల్గొంటారని పేర్కొన్నారు.  సమావేశంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మహేశ్, కౌన్సిలర్ లు నరేష్, అలేఖ్య-, వార్డ్ ఇన్​చార్జిలు తదితరులు 
పాల్గొన్నారు.

మంత్రిపై కేసు నమోదు చేయాలి 

పెగడపల్లి, వెలుగు: వజ్రోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో గన్​పేల్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయాలని జగిత్యాల బీజేపీ అధికార ప్రతినిధి మరిపెల్లి సత్యం పేర్కొన్నారు. ఆదివారం పెగడపల్లిలో మండల శాఖ అధ్యక్షుడు గంగుల కొమురెల్లి తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ఎస్.ఎల్.ఆర్ గన్ పేల్చి ర్యాలీ ప్రారంభించడం చట్ట విరుద్ధమని మంత్రిపై సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారుల నుంచి తుపాకీ తీసుకోవడం నేరమని, పొరపాటున మిస్ఫైర్ అయితే ర్యాలీకి వచ్చిన వారికి ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు. సమావేశంలో బీజేపీ లీడర్లు రవీందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కిషోర్ కుమార్, గంగాధర్, తిరుపతి, రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

వీఆర్ఏలకు అండగా ఉంటాం

ఇల్లందకుంట, వెలుగు: వీఆర్​ఏలు తమ డిమాండ్ల సాధన కోసం 21 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని,  వాళ్ల సమస్యలు పరిష్కరించేదాకా బీజేపీ అండగా ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం ఇల్లందకుంటలోని తహసీల్దార్ ఆఫీస్​ఎదుట నిర్వహించిన వీఆర్​ఏల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం వీఆర్​ఏల పే స్కేలును అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు సురేందర్​రెడ్డి, సాంబయ్య, శ్రీనివాస్ తదితరులు 
పాల్గొన్నారు.