గ్లోబల్ టెంపరేచర్ పెరిగింది..భూమ్మీద అత్యధిక ఉష్ణోగ్రత 2024లోనే

  • వరల్డ్ మెటియొరాలాజికల్ ఆర్గనైజేషన్ వెల్లడి
  • గ్లోబల్ వార్మింగ్​ హద్దునూ దాటేశామన్న  సైంటిస్టులు
  • 1.5 డిగ్రీల హద్దు దాటిన ప్రపంచ సగటు ఉష్ణోగ్రత
  • గడిచిన పదేళ్లలోనే వేడిమి ఎక్కువట

వాషింగ్టన్: ఎండలు ఏటేటా పెరిగిపోతున్నయ్.. కిందటేడు కన్నా ఈ ఏడు, ఈ ఏడాది కన్నా వచ్చే ఏడు.. ఎండలు మండిస్తున్నయ్. గడిచిన పదేళ్లలో ఏటేటా ఎండలు రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. 

అయితే, ఇప్పటి వరకు  భూమ్మీద అత్యధిక వేడిమి నమోదైన ఏడాది మాత్రం 2024 అని వివరించారు. ఈమేరకు వరల్డ్ మెటియొరాలాజికల్ ఆర్గనైజేషన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు, గతేడాదిలో గ్లోబల్ వార్మింగ్​హద్దులనూ దాటేశామని, గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ 1.5 డిగ్రీలను దాటిపోయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

పారిశ్రామిక విప్లవం మొదలు కాకముందు నుంచి ఇప్పటి వరకు ఈ సగటు ఉష్ణోగ్రతను ఇప్పుడే అధిగమించామని తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.6 డిగ్రీలు పెరిగిందని యురోపియన్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించగా.. జపాన్ శాస్త్రవేత్తలు వేసిన లెక్కల్లో ఇది 1.57 డిగ్రీలు పెరిగిందని తేలింది. 

బ్రిటన్ పరిశోధకుల లెక్కల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.53 డిగ్రీలుగా ఉంది. ఆయా సంస్థలు వేర్వేరు పద్ధతులు అనుసరించి గణించినా సగటు ఉష్ణోగ్రత 1.5 పైనే నమోదు కావడం గమనార్హం. మొత్తంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిస్ అగ్రిమెంట్​ను అధిగమించిందని, గ్లోబల్ వార్మింగ్ ​దుష్ప్రభావాలకు తొలి సూచన అని సైంటిస్టులు చెప్పారు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 2023లో 14.98 డిగ్రీలు నమోదైతే.. 2024లో అది 0.12 డిగ్రీలు పెరిగి 15.10 డిగ్రీలకు చేరిందని చెప్పారు.

ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం.. 

ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతూ పోవడానికి ప్రధాన కారణం వాతావరణంలో పెరిగిపోతున్న గ్రీన్ హౌస్ వాయువులేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై శిలాజ ఇంధనాలు.. ఆయిల్, గ్యాస్, బొగ్గులను మండించడం వల్ల పెద్ద మొత్తంలో గ్రీన్ హౌస్ వాయువులు వెలువడుతున్నాయని, అవి నేరుగా వాతావరణంలో కలిసి కలుషితం చేస్తున్నాయని కోపర్నికస్ కు చెందిన వాతావరణ పరిశోధకురాలు సమంత బర్గెస్ వివరించారు.

 వాతావరణంలో గ్రీన్ వాయువులు పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూపోతాయని తెలిపారు. మహా సముద్రాలు, సముద్ర జలాల నీటిమట్టం పెరుగుతుందని, మంచు ఖండాలు కరుగుతూ పోతాయని పేర్కొన్నారు. 2023లో ఏర్పడిన ఓ సూర్యగ్రహణం కారణంగా యూరోపియన్ డేటాబేస్​లో ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీలో ఎనిమిదో వంతు ఒకేసారి పెరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పదేళ్ల కిందటి దాకా ఏటా ప్రపంచ ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీలో వందో వంతు మాత్రమే పెరిగేవని చెప్పారు.

జూలై 10న హాటెస్ట్ డే..

ఉష్ణోగ్రతలు లెక్కించడం ప్రారంభించిన నాటి నుంచి అత్యంత వేడిమి నమోదైన రోజు జూలై 10 అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రోజు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని చెప్పారు. కాగా, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం దారుణంగా ఉండబోతోందని, ఇటీవలి పకృతి వైపరీత్యాలు వాటి చిహ్నాలేనని జార్జియా వర్సిటీ మెటియొరాలజీ ప్రొఫెసర్ మార్షల్ షెపర్డ్ పేర్కొన్నారు.

ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 హద్దు ఏంటి..?

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న గ్లోబల్ వార్మింగ్​ను కట్టడి చేయాలంటే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించి తీరాల్సిందేనని పర్యావరణవేత్తలు, సైంటిస్టులు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. 

ఇందులో భాగంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా చూడాలన్న లక్ష్యంతో 2015, డిసెంబర్ 12న పారిస్ లో జరిగిన యూఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (కాప్ 21)లో 196 భాగస్వామ్య దేశాలు ఒక ఒప్పందం(పారిస్ అగ్రిమెంట్)పై సంతకం చేశాయి. 

ఈ ఒప్పందం ప్రకారం.. గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ స్థాయిలను పారిశ్రామిక విప్లవం(1750-–1850) ముందు నాటి కంటే గరిష్టంగా 2 డిగ్రీలకు మించి పెరగకుండా చూడాలని అన్ని దేశాలు అంగీకరించాయి. 

అయితే, ఇప్పటికే క్లేమేట్ చేంజ్ ప్రభావంతో కరువులు, వరదలు, హీట్ వేవ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలను పారిశ్రామిక విప్లవం నాటి కంటే 1.5 డిగ్రీలకు మించి పెరగకుండా చూడాలని నిర్ణయించారు. 

పారిశ్రామిక విప్లవం కంటే ముందు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14 డిగ్రీల వద్ద ఉండేదని.. దాదాపు 11 వేల ఏండ్ల పాటు స్థిరంగా..14 డిగ్రీ సెంటీగ్రేడ్లకు అటూఇటూగానే కొనసాగిందని చెప్తారు. ఇక భూమి అంతటా ఉపరితలంపై ఉన్న గాలి ఉష్ణోగ్రతనే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ గా చెప్తారు.