- దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేస్త: సీఎం రేవంత్
- ప్రధానిగా మోదీ, సీఎంగా కేసీఆర్ సెగ్మెంట్‌కు పది పైసలు ఇయ్యలే
- డీకే అరుణ పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు తేలేదని ప్రశ్న
హైదరాబాద్, కొడంగల్, పరిగి, వెలుగు: ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎక్కడికి వెళ్లినా కొడంగలే తన గుండెచప్పుడని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలు, కార్యకర్తల కష్టంతోనే తాను నాయకుడిగా ఎదిగానని చెప్పారు. కొడంగల్‌ను దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేస్తానని.. అభివృద్ధి అంటే కొండంగల్ అనేలా తీర్చిదిద్దుతానని అన్నారు. పదేండ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ, ఇన్నేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ఈ నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, తాను సీఎం అయ్యాక సెగ్మెంట్లో అభివృద్ధి పనుల కోసం రూ.5 వేల కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు చెప్పారు. సోమవారం కొడంగల్‌కు వచ్చిన రేవంత్.. తన నివాసంలో మండలాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు తనను ఆదరించారని.. నాయకుడిని చేశారని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం తనతో కొట్లాడే స్వతంత్రం .. పట్టుబట్టి నాతో పనిచేసుకునే హక్కు మీకుందని అన్నారు.
మెజార్టీ తగ్గించే ప్రయత్నాలు
‘‘ఎట్లన్నజేసి కొడంగల్‌లో కాంగ్రెస్ మెజార్టీ తగ్గించాలని డీకే అరుణ, భరత సింహారెడ్డి ప్రయత్నిస్తున్నారు. కొందరు తలమాసినోళ్లు వాళ్ల చుట్టు చేరిండ్రు. వాళ్లను నేను ఒక మాట అడుగుతున్న.. దేని కోసం రేవంత్‌ను పడగొట్టాలి? వేరే ఎవరికైనా ఓటు వేస్తే కొడంగల్ తండాలకు నీరు వస్తాయా? ఇక్కడ చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? వాడు చెప్పిండని వీడు చెప్పిండని.. మతం పేరు మీద కోసిగిలో పంచాయితీలు పెడుతున్నరు. ఎప్పుడైన మన ప్రాంతంలో ఇలాంటి ఘర్షణలు ఉన్నాయా? ఇది మంచిది కాదు. పదేండ్లు ప్రధానిగా ఉన్న మోదీ మనకేమన్న చేసిండా? ఇప్పుడు ఓటేస్తే కొత్తగా ఏమన్న చేస్తడా? ఇయ్యాల అవకాశం రాగానే రూ.5వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినం. కొడంగల్‌లో కాంగ్రెస్ మెజార్టీ తగ్గించి రేవంత్ పరపతి తగ్గియాలని గూడుపుఠాని చేస్తున్నరు. ఇది రేవంత్‌రెడ్డిని దెబ్బతీయడం కాదు. కొడంగల్ ప్రతిష్టను, అభివృద్దిని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం”అని రేవంత్అన్నారు.
ఎవరో చెప్పారని మోసపోవద్దు
డీకే అరుణ మంత్రిగా, బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పాలమూరు ప్రాంతానికి ఏం చేయలేదని.. వ్యక్తిగతంగానే ఎదిగారని రేవంత్ విమర్శించారు. ఆమె పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ స్కీంకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా మనం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని గెలిపిస్తే పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా కోసం కొట్లాడుతడని చెప్పారు. రాహుల్ గాంధీ పీఎం అయితే ఈ ప్రాంత అభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తాడని అన్నారు.
కొడంగల్‌కు కేసీఆర్ ఒక్క ఇల్లు ఇయ్యలే
కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారని.. అభివృద్ధి చేస్తున్నందకు ఓడించాలా అని రేవంత్ ప్రశ్నించారు. ‘‘మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అమలు చేసినందుకా? పేదలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నందుకా? ఆరోగ్యశ్రీ లిమిట్ రూ.10 లక్షలకు పెంచినందుకా? 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నందుకా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా? ఎందుకు ఓడించాలి” అని ప్రశ్నించారు. ఇన్నేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కొడంగల్‌లో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదని విమర్శించారు.
రేవంత్ కాన్వాయ్కి తప్పిన ప్రమాదం
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తున్న కాన్వాయ్ లోని ఓ వెహికల్ టైర్ వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద పేలింది. డ్రైవర్అప్రమత్తతతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
- కొత్త సంవత్సరంలో సమృద్ధిగా వానలు పడాలి
- ప్రజలకు సీఎం రేవంత్ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని.. ప్రజల ఆశలు నెరవేరాలని సీఎం ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలన్నారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.