ఇటాలియన్ ఇన్ ఫ్లుయెన్సర్ గియులియా నాటి తన వివాదాస్పద పోస్ట్ ను తొలగించింది. అంతకుముందు ఆమె చేసిన ఈ పోస్ట్.. చాలా మంది క్యాన్సర్ బాధితులను కించపరిచేలా ఉందని నెటిజన్లు ఆరోపించారు. గియులియా ఇటీవల బెడ్ పై ట్రీట్మెంట్ తీసుకుంటున్న రీల్ ను పోస్ట్ చేసింది. అందులో ఆక్సిజన్ సప్లై మిషన్ కాకుండా.. దాని స్థానంలో ఎరుపు రంగు హెర్మేస్ బ్యాగ్ ఉంది. దాంతో పాటు ఆమె నోరు, ముక్కుపై ఆక్సిజన్ మాస్క్ ఉంది. ఇక్కడ ఐవీ అడ్మినిస్ట్రేషన్ ట్యూబ్ లాంటి వైద్య పరికరాలు కాకుండా బెడ్ పక్కన ఉన్న టేబుల్ పై కొన్ని ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ లు కనిపించడం అందర్నీ విస్తుపోయేలా చేశాయి. బ్యాగ్రౌండ్ లో మానిటర్ లో కనిపించే సిగ్నల్స్ లా బీప్ శబ్ధం కూడా వినిపిస్తోంది. ఈ వీడియోతో పాటు గియులియా.. నాకు ఈ కోరిక ఉంది అని క్యాప్షన్ లో రాసింది.
ఈ పోస్ట్ తక్కువ కాలంలోనే బాగా షేర్ అయింది. అలా ఈ పోస్ట్ వైరల్ కావడంతో చాలా మంది దీనిపై స్పందించేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ నటి కరోలినా మార్కోనీతో సహా అనేక మంది క్యాన్సర్ బాధితులు కోసం ఈ పోస్ట్ పై పలు ఆరోపణలు చేశారు. ఇది అభ్యంతరకరంగా ఉందని, ప్రైవేట్ గా మాట్లాడాలి అని వెనిజులాలో జన్మించిన, రియాలిటీ స్టార్ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న 45ఏళ్ల కరోలినా కోరారు. మాజీ అంకాలజీ పేషెంట్ గా ఈ పోస్ట్ తనను నవ్వించేదిగా లేదన్నారు. అలా ఈ పోస్ట్ పై ట్రోల్స్ వెల్లువెత్తాయి. దీంతో చేసేదేం లేక గియులియా.. తాజాగా ఈ పోస్ట్ ను డిలీట్ చేసింది. ఇది ప్రస్తుతం తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో అందుబాటులో లేనప్పటికీ.. కొందరు మాత్రం ఈ పోస్ట్ స్క్రీన్ షాట్ లను ఇంకా షేర్ చేస్తూనే ఉన్నారు. మరికొందరేమో ఈ పోస్ట్ ఎవరినీ బాధించేదిగా లేదని నమ్ముతూ.. ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.