- మూడో ఫైనల్లోనూ జ్వెరెవ్‌కు నిరాశే
మెల్‌బోర్న్ : వరల్డ్ నంబర్ వన్, ఇటలీ స్టార్ ప్లేయర్ జానిక్ సినర్ వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్ సినర్ 6–3, 7–6 (7/4), 6–3తో రెండోసీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై వరుస సెట్లలో నెగ్గాడు. దీంతో జిమ్ కొరియర్ (1992–93) తర్వాత ఈ టోర్నీలో వరుసగా రెండు ట్రోఫీలు కైవసం చేసుకున్న యంగెస్ట్ ప్లేయర్‌గా 23 ఏండ్ల సినర్ నిలిచాడు. అలాగే నడాల్ (2005, 2006 ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్) తర్వాత కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని మళ్లీ పునరావృతం చేసిన మొదటి ప్లేయర్‌గా సినర్ రికార్డు సృష్టించాడు.
ఇక 2019లో నంబర్‌వన్ జొకోవిచ్, రెండో ర్యాంకర్ రఫెల్ నడాల్ మ్యాచ్ తర్వాత మళ్లీ ఇద్దరు టాప్–2 ప్లేయర్ల మధ్య ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. అది కూడా మూడు సెట్లలోనే ముగియడం మరో విశేషం. గతేడాది సీజన్ ఆరంభం నుంచి టెన్నిస్‌లో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన సినర్.. యూఎస్ ఓపెన్‌తో సహా ఐదు ప్రధాన టోర్నీల్లో మూడింటిని నెగ్గాడు. ప్రస్తుతం అతని వరుస విజయాల రికార్డు 21గా ఉంది. ఓపెన్ ఎరా (1968)లో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన మూడుసార్లూ టైటిల్ నెగ్గిన ఎనిమిదో ప్లేయర్‌గా సినర్ రికార్డులకెక్కగా, ఫైనల్ చేరిన మూడుసార్లు ఓడిన మూడో ప్లేయర్‌గా జ్వెరెవ్ నిలిచాడు.
2020 యూఎస్ ఓపెన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్ ఓటమిపాలయ్యాడు. గతేడాది జూన్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరిన సినర్‌కు, రెండో ర్యాంక్‌లో ఉన్న జ్వెరెవ్‌కు ఈ మ్యాచ్‌లో అంతరం స్పష్టంగా కనిపించింది. 2 గంటలా 42 నిమిషాల పోరాటంలో ఇటలీ ప్లేయర్ అద్భుతంగా ఆడాడు. మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్‌ను కూడా ఎదుర్కోలేదు. తన సర్వీస్‌లో పది బ్రేక్ పాయింట్లు కొట్టాడు. 6 ఏస్‌లు, 32 విన్నర్లు కొట్టిన సినర్ 2 డబుల్ ఫాల్ట్స్, 27 అనవసర తప్పిదాలు చేశాడు. 12 ఏస్‌లు, 25 విన్నర్లు సాధించిన జ్వెరెవ్ 2 డబుల్ ఫాల్ట్స్, 45 తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఇక, విమెన్స్ డబుల్స్ ఫైనల్లో టేలర్ టౌన్సెండ్ (అమెరికా)–సినైకోవా (చెక్) 6–2, 6–7 (4/7), 6–3తో సీహ్ సు వీ (చైనీస్‌తైపీ)–ఒస్తాపెంకో (లాత్వియా)పై నెగ్గి టైటిల్ సాధించారు.