ట్రంప్, మోడీ, నేను మాట్లాడ్తేనే.. ప్రజాస్వామ్యానికి ప్రమాదమా..? పీఎం మెలోనీ ఫైర్

ట్రంప్, మోడీ, నేను మాట్లాడ్తేనే..  ప్రజాస్వామ్యానికి ప్రమాదమా..? పీఎం మెలోనీ ఫైర్

వాషింగ్టన్: దేశాల ప్రయోజనాలు, సరిహద్దులను కాపాడుకోవడం గురించి ట్రంప్, మోదీ, తాను మాట్లాడితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొందరు వామపక్ష భావజాల నేతలు తమపైనే బురద జల్లుతున్నారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫైర్ అయ్యారు. తమను ప్రజాస్వామ్యానికి ముప్పులా భావిస్తున్నారని మండిపడ్డారు. వాషింగ్టన్‎లో నిర్వహించిన కన్జర్వేటివ్ పొలిటికల్‌‌ యాక్షన్ కాన్ఫరెన్స్‎లో మెలోని వర్చువల్‎గా పాల్గొని మాట్లాడారు.

 ‘‘నేను, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌‌, ఇండియా ప్రధాని నరేంద్రమోదీ, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్‌‌ మిలీ ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాం. వామపక్ష నేతల మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ప్రపంచానికి మంచి చేద్దామనుకునే లీడర్లను లెఫ్టిస్టులు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉన్నారు. 

ట్రంప్ పనితీరు, పాలన ఎంతో బాగుంటది. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను ట్రంప్, మోదీ, జేవియర్‎లు పరిష్కరిస్తుంటే.. వామపక్ష నేతలకు మింగుడుపడటం లేదు. వీరికి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 1990 కాలంలో అమెరికాలో బిల్‌‌ క్లింటన్‌‌, బ్రిటన్‌‌లో టోనీ బ్లెయిర్ గ్లోబల్ లెఫ్టిస్ట్ నెట్​వర్క్‎ను సృష్టించినప్పుడు వారిని రాజనీతిజ్ఞులని కీర్తించారు. మమ్మల్ని (మోదీ, మెలోని, ట్రంప్) మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన వ్యక్తులుగా చిత్రీకరిస్తున్నారు’’అని మెలోని మండిపడ్డారు. 

ఎంత విమర్శించినా.. మేమే గెలుస్తున్నాం 

లెఫ్టిస్టులు ఎంత బురదజల్లినా.. ఎంత విమర్శించినా.. ప్రజలు తమనే గెలిపిస్తున్నారని తెలిపారు. ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా.. ట్రంప్ మాత్రం స్థిరమైన పాలన అందిస్తున్నారని చెప్పారు. యూరప్‎తో పాటు ఇటలీలోనూ అక్రమ వలసదారులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాటిన్​ అమెరికాలో ఫెడరల్ వర్క్​ఫోర్స్‎ను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. తామంతా ప్రజల స్వేచ్ఛను కాపాడుతున్నామన్నారు. తనతో పాటు ట్రంప్, మోదీ, జేవియర్ తమ తమ దేశాలను ప్రేమిస్తున్నారని తెలిపారు.