మెల్‌బోర్న్ : డిఫెండింగ్ చాంపియన్, ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సినర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు. మెగా టోర్నీలో తన జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు. విపరీతమైన ఎండ కారణంగా చికిత్స తీసుకున్నా తన మార్కు ఆటతో హోల్గర్ రూనెకు చెక్ పెట్టాడు. వరల్డ్ నంబర్ వన్ సినర్‌తో పాటు విమెన్స్ సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ కూడా క్వార్టర్స్ చేరగా.. ఆరో సీడ్ ఎలెనా రిబకినా నాలుగో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ నాలుగో రౌండ్‌లో టాప్ సీడ్ సినర్ 6-–3, 3-–6, 6–-3, 6–-2తో 13వ సీడ్ రూనె (డెన్మార్క్)పై విజయం సాధించాడు.
రాడ్‌లేవర్ ఎరీనాలో విపరీతమైన ఎండ, వేడి కారణంగా ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. దాంతో బ్రేక్ సమయాల్లో సినర్ తరచూ ముఖంపై కోల్డ్ టవల్ కప్పుకుంటూ, మెడపై నీళ్లు పోసుకుంటూ కనిపించాడు. మూడో సెట్‌లో సినర్, రూనె చెరోసారి మెడికల్ టైమౌట్ కూడా తీసుకున్నారు. నాలుగో సెట్‌లో సినర్ కొట్టిన భారీ సర్వీస్ తగిలి నెట్‌ను గ్రౌండ్‌కు కనెక్ట్ చేసే స్ర్కూ బయటికి వచ్చింది. దీన్ని సరిచేసేందుకు 20 నిమిషాల సమయం పట్టడంతో ప్లేయర్లు అసహనం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో భారీ సర్వీస్‌లతో హడలెత్తించిన సినర్ 14 ఏస్‌లు, 35 విన్నర్లు కొట్టాడు.
ఆరు డబుల్ ఫాల్ట్స్, 35 అనవసర తప్పిదాలు చేసినా నాలుగు బ్రేక్ పాయింట్లతో పైచేయి సాధించాడు. మరోవైపు 5 ఏస్‌లు, 31 విన్నర్లకు పరిమితం అయిన రూనె నాలుగు డబుల్ ఫాల్ట్స్, 54 అనవసర తప్పిదాలు చేశాడు. ఒక్క బ్రేక్ పాయింట్ మాత్రమే సాధించగలిగాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా) 6–0, 7–6 (7/5), 6–3తో వరుస సెట్లలో అలెక్స్ మిచెల్సెన్ (అమెరికా)పై నెగ్గగా, గైల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) 6–7 (3/7), 7–6 (7/3), 6–7 (2/7), 0–1తో నిలిచిన దశలో వెన్నునొప్పితో ఆట నుంచి వైదొలిగాడు. దాంతో అతని ప్రత్యర్థి 21వ సీడ్ షెల్టన్ (అమెరికా) వాకోవర్‌తో క్వార్టర్స్ చేరాడు. లోరెంజో సెనెగో (ఇటలీ) 6–3, 6–2, 3–6, 6–1తో లర్నర్ టీన్ (అమెరికా)పై గెలిచాడు.
విమెన్స్ టాప్ ర్యాంకర్ ఇగా స్వైటెక్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ స్వైటెక్ (పోలాండ్)6–0, 6–1తో ఎవా లైస్ (జర్మనీ)ని వరుస సెట్లలో చిత్తు చేసింది. కేవలం 11 గేమ్స్‌లోనే లైస్ ఆట కట్టించిన స్వైటెక్ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ అమెరికా ప్లేయర్ ఎమ్మా నవరోతో పోటీకి సిద్ధమైంది. మరో మ్యాచ్‌లో నవరో 6–4, 5–7, 7–5తో తొమ్మిదో సీడ్ డారియా కసట్కినా (రష్యా)పై మూడు సెట్ల పాటు పోరాడి గెలిచింది.
కానీ, ఆరో సీడ్ ఎలెనా రిబకినా (కజకిస్తాన్) 3–6, 6–1, 3–6తో 13వ సీడ్ మాడిన్ కీస్ (అమెరికా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఉక్రెయిన్ స్టార్ ఎలినా స్వితోలినా 6–4, 6–1తో వెరోనియా కుదెర్మెటోవా (రష్యా)ను వరుస సెట్లలో ఓడించి మూడోసారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.