- ఈఎంఐలు, కరెంట్ బిల్లులు కట్టలేక అవస్థలు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం మన్యంలో గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఐటీడీఏ చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. వర్క్ ఆర్డర్లు లేక భద్రాచలం, దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలలో ఏర్పాటు చేసిన యూనిట్లు మూతపడ్డాయి. బ్యాంకు లోన్లకు ఈఎంఐలు, కరెంటు బిల్లులు కట్టలేక గిరిజన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసర్లు మారి వారి విధానాలు కూడా మారడంతో గిరిజన మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి.
దీంతో అప్పుల గండం నుంచి బయటపడితే చాలు అని గిరిజన మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. భద్రాచలంలో రూ.40లక్షలతో, దుమ్ముగూడెం మండలం లక్ష్మినగర్‌లో రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన యూనిట్లు ఇప్పుడు మూతపడి గిరిజన మహిళలను వీధిన పడేశాయి. లాభాల మాట దేవుడెరుగు...కష్టాల నుంచి గట్టెక్కించాలని దేవున్ని మొక్కుకుంటున్నారు.
వర్క్ ఆర్డర్లు లేక...!
భద్రాచలం ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో శ్రీలక్ష్మీ గణపతి మహిళా ట్రైబల్ జాయింట్ లయబిలిటీ గ్రూప్ న్యూట్రిషన్ మిక్స్ అండ్ డ్రై మిక్స్ యూనిట్‌ను గత సంవత్సరం ఏర్పాటు చేశారు. గిరిజన మహిళలతో మైక్రో స్మాల్ మీడియం ఎంపవర్మెంట్ పేరిట గిరిజన సంక్షేమశాఖ ద్వారా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. రూ.40లక్షల యూనిట్లో 60శాతం సబ్సిడీ, 30శాతం బ్యాంకు లోన్, 10 శాతం లబ్దిదారుల వాటాతో ఇండస్ట్రీ నెలకొల్పారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 12 అంగన్వాడీ సెంటర్లతో పాటు, మననూర్ ఐటీడీఏ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు జొన్న పాయసం, ఉప్మా, కిచిడీలను తయారు చేసి ఈ యూనిట్ నుంచి సరఫరా చేస్తారు.
జీసీసీ(గిరిజన సహకార సంస్థ) ముడిసరుకులను ఈ యూనిట్‌కు సరఫరా చేస్తోంది. గత సంవత్సరం వరకు ఈ మూడింటిని సరఫరా చేశారు. కానీ ఈ సంవత్సరం వర్క్ ఆర్డర్ లేక యూనిట్మూతపడింది. దీనితో గిరిజన మహిళలు బ్యాంకుకు రూ.25వేల నెలవారీ ఈఎంఐ మూడు నెలలుగా కట్టడం లేదు. కరెంట్బిల్లు కూడా రూ.10వేల వరకు పెండింగ్‌లో ఉంది. దీనితో ప్రస్తుతం భద్రాచలంలోని యూనిట్ మూతపడింది. ఇక దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరం పల్లీ పట్టీ తయారీ యూనిట్ కూడా మూడు నెలలుగా మూతపడింది. ఈ యూనిట్‌కు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.17లక్షల వరకు ఉన్నాయి. భద్రాచలం, మననూర్ ఐటీడీఏల నుంచి వర్క్ఆర్డర్లు రాకపోవడంతో తయారీ ఆగిపోయింది. మూడు నెలలుగా కరెంట్ బిల్లులు రూ.10వేలతో పాటు, నెలకు రూ.20వేల బ్యాంకు ఈఎంఐలు కట్టలేక గిరిజన మహిళలు ఇబ్బంది పడుతున్నారు.
మార్కెటింగ్ పై శిక్షణ కరువు
భద్రాచలంలో జొన్న కిచిడీ, జొన్న పాయసం, జొన్న ఉప్మాలతో పాటు దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని పల్లీ పట్టీలను మార్కెటింగ్ చేసుకోవడంలో గిరిజన పారిశ్రామిక వేత్తలకు ఐటీడీఏ శిక్షణ ఇవ్వలేదు. కేవలం ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే సరఫరా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఐటీడీఏ పీవో, డీడీ(ట్రైబల్ వెల్ఫేర్)లు బదిలీ అయి కొత్తవారు వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారమే ఆహార పదార్ధాలను సరఫరా చేస్తారు. బడ్జెట్లో వీటికి నిధులు లేవు. దీనితో వర్క్ ఆర్డర్లు ఇవ్వడంలేదు. అధికారులు స్పందించి ప్రత్యేక దృష్టి సారించాలని మహిళలు ఎదిరి చూస్తున్నారు.
ఐటీడీఏ ఆదుకోవాలి
వర్క్ ఆర్డర్లు ఇచ్చి ఐటీడీఏ ఆదుకోవాలి. లేకుంటే ఈఎంఐలు, కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేని దుస్థితి మాది. అంగన్వాడీ, ఆశ్రమ పాఠశాలల నుంచి వర్క్ ఆర్డర్లు వస్తేనే మాకు పని ఉంటుంది. ప్రస్తుతం మూడు నెలలుగా పనిలేక కూలీ పనులకు వెళ్తున్నాం.
కారం రామమ్మ, భద్రాచలం యూనిట్ ప్రెసిడెంట్
యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం
గిరిజన మహిళలకు ఉపాధి కల్పించేలా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. గత సంవత్సరమే ఈ రెండు యూనిట్లు ఏర్పాటు చేశాం. ఐటీడీఏనే కాకుండా బయట ఆర్డర్లు కూడా వస్తే గిరిజన మహిళలకు ఉపాధి దొరుకుతుంది. మార్కెటింగ్‌పై వారికి అవగాహన కూడా కల్పిస్తాం.
ఉదయ్‌భాస్కర్, ఏపీవో(అగ్రికల్చర్) భద్రాచలం ఐటీడీఏ