మేడారం పనులు నెలాఖరులోగా కంప్లీట్‌‌ చేయాలి : ఐటీడీఏ పీవో అంకిత్‌‌

తాడ్వాయి, వెలుగు : మేడారం జాతర ఏర్పాట్లను జనవరి చివరి వారంలోపు పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్‌‌ ఆదేశించారు. జాతర నిర్వహణపై ఎస్పీ శబరీశ్‌‌, అడిషనల్‌‌ కలెక్టర్లు పి.శ్రీజ, వేణుగోపాల్‌‌తో కలిసి గురువారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ మేడారం ప్రాంతాన్ని ఎనిమిది జోన్లుగా, 42 సెక్టార్లుగా విభజించామని, వాటికి ప్రత్యేక ఆఫీసర్లను సైతం నియమించామని చెప్పారు. జాతర టైంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర నిర్వహణలో నోడల్‌‌, సెక్టోరియల్‌‌ ఆఫీసర్ల పాత్ర కీలకమని వారు ఇతర ఆఫీసర్లను కోఆర్డినేట్‌‌ చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని చెప్పారు.

జాతర ప్రాంతంలో 30 హెల్త్‌‌ క్యాంప్‌‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మేడారానికి ఏడు జిల్లాల నుంచి 6 వేల బస్సులను నడపనున్నట్లు చెప్పారు. రివ్యూలో డీఎంహెచ్‌‌వో అప్పయ్య, ఆర్డీవో సత్యపాల్‌‌రెడ్డి, డీఎస్పీ రవీందర్, డీపీవో వెంకయ్య, ఎండోమెంట్‌‌ ఈవో రాజేంద్ర, వెల్ఫేర్‌‌ ఆఫీసర్‌‌ ప్రేమలత, ఐటీడీఏ ఏపీవో వసంతరావు పాల్గొన్నారు. 

ఆదివాసీ సంఘాలతో పీవో మీటింగ్

ఏటూరునాగారం, వెలుగు : మేడారం జాతర నిర్వహణపై ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ సంఘాలతో గురువారం ఐటీడీఏ పీవో అంకిత్‌‌ మీటింగ్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర పనులు, ఇతర నిర్వహణలపై సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించడంతో పాటు, మద్యం, కొబ్బరి, బెల్లం దుకాణాలను ఆదివాసీ సంఘాలు, పూజారులకు మాత్రమే కేటాయించాలని కోరారు.

మద్యం దుకాణాలు 15 రోజుల పాటు నిర్వహించుకునేలా పర్మిషన్‌‌ ఇవ్వాలన్నారు. మేడారం ట్రస్ట్ బోర్డు కమిటీలో గిరిజనులనే ఎంపిక చేయాలని కోరారు. జాతర ప్రాంగణంలో గిరిజన సంస్కృతి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు దాట్ల నాగేశ్వర్‌‌రావు, బాబు, పొడెం రత్నం, కొప్పుల రవి కోరారు.