- ఐటీడీఏ పీవో రాహుల్ నిర్ణయం
- స్టూడెంట్స్కు ఉద్యోగసాధన సులువయ్యేలా ప్లాన్
భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 34 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో మినీ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో 11, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 23 హాస్టళ్లలో వేలాది మంది స్టూడెంట్లు డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, పీజీ, ఫార్మసీ, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఇంజినీరింగ్చదువుతున్నారు. కేవలం వసతి, భోజనానికే పరిమితమైన ఈ హాస్టళ్లలో చదివిన విద్యార్థులు ఉద్యోగాల ఎంపిక కోసం జరిగే ఎగ్జామ్స్ లో రాణించేలా ప్లాన్ చేస్తున్నారు.
5,070 మంది స్టూడెంట్స్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాస్టళ్లలో ఉండి ఇంటర్ చదివే స్టూడెంట్లు 1965 మంది, డిగ్రీ స్టూడెంట్లు 2,137, ఐటీఐ స్టూడెంట్లు 116, పాలిటెక్నిక్ స్టూడెంట్లు 212, ఇంజినీరింగ్ స్టూడెంట్లు 181, పీజీ స్టూడెంట్లు 59, ఫార్మసీ స్టూడెంట్లు182, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్లు 87, ఇతర స్టూడెంట్లు 131 మంది మొత్తంగా 5,070 మంది ఉన్నారు.
ఉద్యోగసాధన సులువయ్యేలా..
ఆర్థిక పరిస్థితి సరిగా లేని నిరుపేద ఆదివాసీ స్టూడెంట్లకు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లే దిక్కు. ఏటా ఈ హాస్టళ్ల నిర్వహణకు ఐటీడీఏ రూ.5కోట్లకు పైగా బడ్జెట్ను ఖర్చు చేస్తోంది. కానీ విద్యార్థులకు అవసరమైన బుక్స్ మాత్రం అందుబాటులో ఉంచలేక పోతోంది. ఇక్కడ సరైన దిశా, నిర్ధేశం లేక స్టూడెంట్లు ఆగమవుతున్నారు. ఉద్యోగ మేళాలు పెట్టినా సరైన అర్హతలు లేవంటూ వెనక్కు వస్తున్నారు.
ఐటీఐ చదివే స్టూడెంట్తర్వాత ఉద్యోగం కోసం పోవాలంటే ఎలా ప్రిపేర్ కావాలి? ఎక్కడ అవకాశాలు ఉన్నాయి? అనే ప్రాథమిక అవగాహన కూడా ఉండటం లేదు. ఈ క్రమంలో వారి ఆలోచనకు అనుగుణంగా లైబ్రరీలలో బుక్స్ ఉంచి వారికి ఉద్యోగసాధన ఈజీ అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఏటా ఉపాధి కల్పనా కార్యాలయంలో 3వేలకు మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ తీసుకున్న నిర్ణయం వారికి వరంగా మారనుంది.
స్టూడెంట్స్ జీవనోపాధే లక్ష్యంగా..
పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఉండి చదివే ఆదివాసీ స్టూడెంట్ల కోసం ముందుచూపుతో వ్యవహరిస్తాం. వారు చదివే కోర్సుల ఆధారంగా ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? వారి ఆలోచన ఏంటి? వీటిని పరిగణనలోకి తీసుకుంటాం. ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఇతర కోర్సుల తర్వాత వెళ్లే ఉద్యోగ పరీక్షల కోసం మినీ లైబ్రరీలలో పుస్తకాలు ఏర్పాటు చేస్తాం. వాటికి ఎలా ప్రిపేర్ కావాలో కూడా ట్రైనింగ్ఇస్తాం. వారి జీవనోపాధే లక్ష్యంగా బుక్స్ అప్డేట్ చేస్తాం. - బి.రాహుల్, పీవో, ఐటీడీఏ, భద్రాచలం