భద్రాచలం,వెలుగు : ట్రైబల్ మ్యూజియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలో ఏరు టూరిజాన్ని ప్రారంభిస్తున్న వేళ ట్రైబల్ మ్యూజియంలో జరుగుతున్న పనులను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మ్యూజియం వద్ద పనికిరాని వస్తువులను తక్షణమే తొలగించాలని సూచించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన కళాఖండాలను అంశాల వారీగా విభజించి అమర్చాలని తెలిపారు. నిర్మించిన గిరిజన పల్లెలో టూరిస్టులు సంతోషంగా గడిపేలా ఆదివాసీ వంటలు, అటవీ ఉత్పత్తులు ఉంచాలని అన్నారు. ఆదివాసీ సంప్రదాయ దుస్తులతో ఫొటోలు దిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గోడలపై గిరిజన సంస్కృతికి సంబంధించిన చిత్రాలు వేయాలని అన్నారు.