లైబ్రరీలో అన్ని బుక్స్​ అందుబాటులో ఉంచాలి : ఐటీడీఏ పీవో బి.రాహుల్

లైబ్రరీలో అన్ని బుక్స్​ అందుబాటులో ఉంచాలి : ఐటీడీఏ పీవో బి.రాహుల్

 

    
ఇల్లెందు, వెలుగు : ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లెందులో నిరుద్యోగ యువతి, యువకులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అయ్యేందుకు అన్ని రకాల పుస్తకాలు, న్యూస్ పేపర్లు గ్రంథాలయంలో అందుబాటులో ఉంచాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సిబ్బందికి సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభం కానున్న ఇల్లెందు  గ్రంథాలయంలోని గదులను, పాఠకుల కోసం ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలను ఆయన మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 26 నుంచి అందరికీ అందుబాటులో ఉండేలా రోజూ గ్రంథాలయం తెరిచి ఉండాలన్నారు.  గ్రంథాలయంలోని పుస్తకాలు, మెటీరియల్ పూర్తిస్థాయిలో అమర్చిన తర్వాత దానికి సంబంధించిన ఫొటోలు తనకు పంపించాలని లైబ్రేరియన్ రుక్మిణినికి సూచించారు. అనంతరం సుదిమళ్లలోని గిరిజిన బాలికల కళాశాలను సందర్శించారు.  కళాశాలలో జరుగుతున్న మైనర్ రిపేర్ పనులను పరిశీలించారు.

పనులు ఈనెల 25 లోగా  పూర్తయ్యేలా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ తరగతి గదిని పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడుతూ క్రమం తప్పకుండా క్లాసులకు అటెండ్ కావాలని సూచించారు. అనంతరం స్టూడెంట్స్​తో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీవో నాగార్జున రావు, ఏటీడీవో రాధమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ చంద్రశేఖర్, ఏఈ సాలార్,  ప్రిన్సిపాల్ మాధవి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. .