
భద్రాచలం, వెలుగు: ట్రైబల్ మ్యూజియం పనులను స్పీడప్ చేయాలని ఐటీడీఏ పీవో బి రాహుల్ ఆదేశించారు. సోమవారం ట్రైబల్ మ్యూజియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పండుగలు, పూజా విధానాలు, దేవతామూర్తుల గురించి చిత్రపటాల ద్వారా పర్యాటకులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటకులకు కనువిందు చేసేలా మ్యూజియంను ముస్తాబు చేయాలన్నారు.
కోయ, నాయకపోడ్, కొండ రెడ్లు, గోర్ బంజారా(లంబాడా) తెగల దేవతామూర్తులను ప్రత్యేకంగా ప్రతిష్ఠించాలన్నారు. ఆదివాసీల వేట విధానం, పాతకాలపు పనుల పెయింటింగ్స్ వేయించాలన్నారు. అనంతరం మీటింగ్ హాల్లో జరిగిన గిరిజన దర్బార్లో వివిధ సమస్యలపై గిరిజనుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించి, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు.