- వీడియో కాన్ఫరెన్స్ లో ఐటీడీఏ పీవో బి.రాహుల్
భద్రాచలం, వెలుగు : ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ, గురుకులాలు, హాస్టళ్లలో పనిచేసే హెచ్ఎంలు, వార్డెన్లు, సబ్జెక్టుటీచర్లు, ప్రిన్సిపాళ్లు, ఫ్యాకల్టీలు కలిసి కట్టుగా ఉండి స్టూడెంట్లకు కొత్తగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశించారు. ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకులాలు, ఆశ్రమాలు, హాస్టళ్ల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
చక్కటి విద్యాబోధనతో గతేడాది కంటే ఎక్కువశాతం రిజల్ట్స్ సాధించేలా ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆహార పదార్థాలన్నీ తాజాగా ఉండాలన్నారు. సమయపాలన తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. టీచర్లు, హెచ్ఎంలు పరిశీలించాకే స్టూడెంట్లకు ఆహారం వడ్డించాలని సూచించారు. ఇప్పుడు పరీక్షల కాలం కావడంతో సిబ్బంది మొత్తం స్టూడెంట్ల స్టడీపైనే ఫోకస్ పెట్టాలన్నారు. యూనిట్ ఆఫీసర్లు పక్కాగా మానిటరింగ్ చేయాలని చెప్పారు.
గిరిజన గురుకులాల్లో మెరుగైన విద్యాబోధన
పాల్వంచ : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో మెరుగైన విద్యాబోధన జరుగుతోందని పీవో తెలిపారు. శుక్రవారం పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల సందర్శనకు వచ్చిన న్యాక్ బృందానికి కళాశాలలో అందుతున్న సేవల గురించి వివరించారు. డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చక్కటి మెనూతో పాటు నిష్ణాతులైన ఫ్యాకల్టీతో విద్యాబోధన సాగుతోందని, కంప్యూటర్ శిక్షణ, లేబరేటరీ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు.
విశాలమైన ఆటస్థలం, ప్రత్యేక తరగతులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గిరిజన గురుకులాల్లో చదివిన అనేకమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. స్టూడెంట్స్ను విహారయాత్రలకు తీసుకెళ్లడంతో పాటు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో గురుకులం ఆర్ సీవో నాగార్జునరావు, కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, న్యాక్ బృందం సభ్యులు పాల్గొన్నారు.