నిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ మంజూరుకు కృషి : చాహత్ బాజ్ పాయ్

నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ మంజూరుకు కృషి చేస్తానని ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్ అన్నారు. గిరిజన విద్యార్థులకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో జరిగిన డివిజన్ స్థాయి క్రీడా పోటీలను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తుండడం అభినందనీయమన్నారు.

వీరిని క్రీడారంగంలో మరింత ప్రోత్సహించేందుకు ఐటీడీఏ ద్వారా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నిరంతర శిక్షణలతో వీరందరికీ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, ఏసీఎంఓ శివాజి, పీడీలు భూక్య రమేశ్ తదితరులు పాల్గొన్నారు.