
ఆసిఫాబాద్, వెలుగు: ఆశ్రమ స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా హెచ్చరించారు. బుధవారం రెబ్బెన మండలం గోలేటిలోని బాలుర ఆశ్రమ స్కూల్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, స్టోర్ రూమ్, తాగునీటి వసతి, భోజనాలను పరిశీలించారు. ఆర్వో ప్లాంట్ పనిచేయక విద్యార్థులు బోర్ నీళ్లు తాగుతుండడం, మెనూ సక్రమంగా పాటించకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంగళవారం బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్, మజ్జిగ అందించకపోవడం, శానిటేషన్ సక్రమంగా లేకపోవడం, మెనూ ప్రకారం బుధవారం వెజ్ బిర్యానీ పెట్టాల్సి ఉన్నా పెట్టకపోవడంతో పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం రవీందర్, వార్డెన్ మోహన్ దాస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన హిందీ టీచర్ ఆర్.రాజేశ్వర్‌కు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈసందర్భంగా పీవో మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.