పాల్వంచ రూరల్, వెలుగు : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలల విద్యార్థులకు చదువుతోపాటు వారికి ఇష్టమైన క్రీడలలో శిక్షణ ఇచ్చి, జాతీయస్థాయిలో పథకాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోచ్ లకు ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. శనివారం పాల్వంచ డివిజన్లోని కిన్నెరసాని క్రీడాపాఠశాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాలలో విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడల అధికారి గోపాలరావు, వాలీబాల్ కోచ్ వాసు, అథ్లెటిక్ కోచ్ రాంబాబు, ఆర్చరీ కోచ్ ప్రసాద్, కబడ్డీ కోచ్ కల్తీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.