ములకలపల్లి, వెలుగు : గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ అందించకపోతే చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో రాహుల్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని కమలాపురం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల, వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని డార్మెట్రీ బ్లాక్, కిచెన్ షెడ్, కూరగాయలు పరిశీలించి పరిసరాల అపరిశుభ్రత పట్ల హెచ్ఎం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం రోజూ భోజనం పెడుతున్నది, లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
వేసవి సెలవులు అనంతరం పాఠశాలకు తిరిగి వచ్చిన పిల్లల ఆరోగ్య స్థితిగతులను హెచ్ఎం, వార్డెన్ గమనిస్తూ ఉండాలని చెప్పారు. టాయిలెట్, తాగునీరు, బాత్రూమ్స్, కరెంటు లాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిబ్బంది అంతా స్థానికంగానే నివాసం ఉండాలని, అలా నివాసం ఉండని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులకు హిందీ, ఇంగ్లీషు సబ్జెక్టులలో నైపుణ్యత సరిగా లేదని, పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని సూచించారు. అనంతరం ములకలపల్లిలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఆయనప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఓసీ కంపెనీ సేల్స్ ఆఫీసర్ ప్రసాద్, తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీవో భారతి, జీసీసీ మేనేజర్లు లక్ష్మోజి లక్ష్మణ్, నరసింహారావు సిబ్బంది పాల్గొన్నారు.