దమ్మపేట/అశ్వారావుపేట, వెలుగు : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ అందించాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ సూచించారు. శనివారం అశ్వారావుపేట, దమ్మపేట మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల భీముని గూడెం, అంకంపాలెంలోని గురుకుల కళాశాలను ఆయన సందర్శించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాతావరణం మార్పులతో స్టూడెంట్స్ అనారోగ్యానికి గురికాకుండా చూడాలన్నారు. పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్స్, కరెంటు తదితర సౌకర్యాలన్నీ ఉండేలా చూడాలని చెప్పారు. వానకాలంలో పాములు, తేళ్లు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతిక్షణం అలర్ట్గా ఉండాలని సూచించారు.
టీచర్లపై ఫైర్
స్టూడెంట్స్కు నిర్వహించిన క్విజ్ పోటీల్లో సబ్జెక్టు టీచర్లు పిల్లలకు అర్థమయ్యే రీతిలో ప్రశ్నలు వేయకుండా అసంపూర్తి ప్రశ్నలు వేస్తున్నారని పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. భీముని గూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలలో 10 /10 గ్రేడ్ సాధించిన విద్యార్థిని జ్యోతి చందుకు ఆయన ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అధికారి మణెమ్మ, ఏటీడీవో చంద్రమోహన్, స్కూల్ హెచ్ఎం పద్మ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డేవిడ్, క్రీడల అధికారి గోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.