భద్రాచలం, వెలుగు : దుమ్ముగూడెం మండలంలోని సింగవరం, ఎన్.లక్ష్మీపురం గ్రామాల్లో ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ శనివారం పర్యటించారు. తమ గ్రామాలకు కరెంట్ సౌకర్యం లేదంటూ పీవోకు గతంలో గ్రామస్తులు మొర పెట్టుకున్నారు. ఐటీడీఏ నుంచి రూ.18లక్షలు మంజూరు చేసి, ట్రాన్స్ కో ద్వారా సబ్సిడీ ఇప్పించి ఈ రెండు గ్రామాల్లో 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు 8 ఏర్పాటు చేసి 11 కేవీ లైన్ నుంచి సరఫరాను అందజేశారు.
రెండు గ్రామాల్లోని 117 మంది గిరిజన రైతులకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను అందించారు. ఆ పనులను పీవో పర్యవేక్షించారు. పనులు పూర్తి చేసిన ఏపీవో అగ్రికల్చర్, ట్రాన్స్‌కో ఆఫీసర్లను అభినందించారు. తమ కరెంట్ సమస్యను తీర్చిన పీవోకు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆదివాసీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలి
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ సూచించారు. ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరక్టర్ కత్లే శ్రీధర్ శనివారం పీవోను తన బృందంతో కలిశారు. తమ సంఘం చేస్తున్న డాక్యుమెంటరీ గురించి పీవోతో చర్చించారు. ఈ సందర్భంగా పీవో శ్రీధర్ బృందాన్ని అభినందించారు. అంతరించిపోతున్న సంస్కృతి
సంప్రదాయాలను నేటి తరానికి అందించేందుకు చేస్తున్న డాక్యుమెంటరీ వినూత్నంగా ఉందని పేర్కొన్నారు. అవగాహన కల్పించడంతో పాటు, సంస్కృతి నృత్యాలను నేర్పిస్తూ, కళా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడుతుందన్నారు. గిరిజన యువత ఈ కార్యక్రమానికి ముందుకు రావాలని పీవో పిలుపునిచ్చారు.