భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జి ల్లాలో అర్హులైన పోడు సాగుదారులందరికీ పట్టాలివ్వాలని, గొత్తికోయలను ఎస్టీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో గిరిజనులు సోమవారం భద్రాచలం ఐటీడీఏను ముట్టడించారు. గోదావరి బ్రిడ్జి నుంచి ర్యాలీగా ఐటీడీఏ వద్దకు చేరుకున్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలివ్వాలని, సాగునీరందించాలని, గొత్తికోయల గ్రామాలకు రోడ్లు, తాగునీరు, కరెంట్సౌకర్యం కల్పించాలన్నారు. ఉపాధి కల్పించి, ఊర్లను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించాలని, ఎస్టీ సర్టిఫికెట్లు ఇచ్చి పై చదువులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
అన్ని ప్రభుత్వ సబ్సిడీ పథకాలు వర్తింపజేయాలని కోరారు. గత బీఆర్ఎస్సర్కార్హయాంలో 3 లక్షల ఎకరాలకు పట్టాలివ్వాలని లక్ష మంది పోడు సాగుదారులు దరఖాస్తు చేసుకోగా, 50వేల మందికి మాత్రమే ఇచ్చారన్నారు. అటవీశాఖాధికారులు వచ్చి పోడు భూములను లాక్కుంటున్నారన్నారు. అర్హులందరికీ పట్టాలివ్వాలన్నారు. జిల్లా లీడర్లు ప్రభాకర్, నూప భాస్కర్, కంగాల కల్లయ్య, పోతుగంట లక్ష్మణ్, తోడెం దుర్గమ్మ, భద్రాచలం డివిజన్ లీడర్లు సాయన్న చరణ్, మునిగెల శివ ప్రశాంత్, పాలం చుక్కయ్య, సుజాత, శాంతక్క, మహేశ్వరి పాల్గొన్నారు.