పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మునుపెన్నడూ లేని రీతిలో జిల్లాలో అత్యధికంగా 83.06 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ప్రభుత్వ బడుల్లో చదివిన 5816 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్ స్కూల్స్ లోని 52598 మంది స్టూడెంట్స్ టెన్త్ లో పాస్ అయ్యారు. ఇప్పుడు వీరిలో చాలా మంది ఇంజినీరింగ్, మెడిసిన్, అకౌంట్స్ రంగాలవైపు దృష్టి సారిస్తారు. తక్కువ గ్రేడ్ వచ్చిన వారు, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఓ మోస్తారుగా ఉన్నవారు ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ) కోర్సులను ఎంచుకునేందుకు మొగ్గు చూపుతారు. ఒకటి, రెండు సంవత్సరాల కోర్సులతో సత్వర ఉపాధి పొందే వీలు ఐటీఐలో ఉంది.
చిన్న వయసులోనే సొంతంగా బిజినెస్ యూనిట్లను ప్రారంభించుకునే సౌలభ్యం ఉంది. ఐటీఐల్లో రెండేళ్లు కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు ఉన్నత చదువుల కోసం నేరుగా పాలిటెక్నిక్ రెండో ఏడాదిలో ప్రవేశానికి ప్రభుత్వం అనుమతివ్వడంతో ఐటీఐ సీట్లకు మరింత డిమాండ్ పెరిగింది. ఐటీఐ కోర్సు అనంతరం నెలరోజుల పాటు ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సును నిర్వహించి పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో సంబంధిత బ్రాంచిలో నేరుగా రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పిస్తున్నారు.
అప్రెంటీస్‍తో మరింత ఉపాధి
ఐటీఐల్లో ఇంజినీరింగ్ కోర్సులు రెండేళ్ల కాల వ్యవధిలో ఉంటాయి. నాన్-ఇంజినీరింగ్ కోర్సులు ఏడాది కాల వ్యవధిలో ముగుస్తాయి. అలాగే ఆరునెలల కాలపరిమితితో ముగిసే డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఏడాది వ్యవధిగల కోర్సు తీసుకున్న వారు రెండు సెమిస్టర్లు, రెండేళ్ల వ్యవధి గల కోర్సుల్లో చేరిన వారు నాలుగు సెమిస్టర్ పరీక్షలను రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. రెండేళ్ల వ్యవధి గల కోర్సుల్లో చేరిన వారు కోర్సు అయిపోగానే ఏడాదిపాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. అదే ఏడాది వ్యవధి గల కోర్సులో చేరితే రెండేళ్ల పాటు అప్రెంటీస్ చేస్తేనే రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాల ఎంపికలో ప్రయారిటీ ఇస్తారు. ఉద్యోగం కాకుండా వీరు సొంతంగా బిజినెస్ యూనిట్లు స్థాపించేందుకు పలు బ్యాంకులు రుణాలు కూడా అందజేస్తాయి.
ఇంజినీరింగ్ ట్రేడ్లు
ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టం, అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్), ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్), రేడియో-టీవీ మెకానిక్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), మోటార్ వెహికల్ మెకానిక్, టర్నర్, వెజల్ నావిగేటర్, వైర్‌మన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్), రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ తదితర కోర్సులు ఇంజినీరింగ్ విభాగం కింద విద్యార్థులు ఎంచుకోవచ్చు. అలాగే శానిటరీ హార్డ్‌వేర్ ఫిట్టర్, షీట్‌మెటల్ వర్కర్, పెయింటర్ (జనరల్), మెకానిక్ (డీజిల్), మౌల్డర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్) తదితర కోర్సులను ఏడాది కాల వ్యవధిలో పూర్తిచేసే వీలుంది.
నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్లు
లిథో- ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్, మాసన్, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్, ప్లంబర్, వెల్డింగ్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), డ్రైవర్ కమ్ మెకానిక్ (ఎల్ఎంవీ), బుక్‌బైండింగ్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్‌మేకింగ్, హార్టికల్చర్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ తదిర కోర్సులు నాన్ ఇంజినీరింగ్ కోర్సుల కింద ఉన్నాయి. వీటిని ఏడాది టైంలో పూర్తిచేయొచ్చు.
డిప్లొమా కోర్సులు
ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, లెదర్, అపెరల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్‌కండిషనింగ్, ఫ్యాబ్రికేషన్ (ఫిట్టింగ్, వెల్డింగ్), ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ మెషినరీ, కన్‌స్ట్రక్షన్ ఉడ్ వర్కింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రొడక్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, ఆటోమొబైల్స్, ప్రాసెస్ ప్లాంట్ మెయిన్‌టెనెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టూరిజం, బ్యాంబూ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, టెక్స్‌టైల్ టెక్నాలజీ తదితర కోర్సులను డిప్లొమా కింద ఆరు నెలల్లో పూర్తి చేయొచ్చు.
ఆన్‍లైన్‍లో నిర్వహించే ఐటీఐ ప్రవేశాలకు త్వరలోనే ప్రభుత్వ ప్రకటన జారిచేసేందుకు సన్నాహాలు చేస్తుంది.