
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ని జూలై 31లోగా ఫైల్ చేయాలి. ఈ గడువులోగా చెల్లించకపోతే పన్ను చెల్లింపుదారులపై పెనాల్టీ పడుతుంది. అయితే నిర్దేశిత గడువులోపు ఐటీఆర్‌ను ఫైల్ చేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వాన్ని గడువు పొడిగించాల్సిందిగా కోరుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఐతే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు జూలై 31 చివరి రోజు. ఈ గడువు తప్పినట్లయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234A పెనాల్టీ ఛార్జీ, వడ్డీ ఛార్జీ పడుతుంది. అదనంగా సెక్షన్ 234F ఆలస్య రుసుం, విధిస్తుంది. ఇది పన్ను చెల్లింపుదారు మొత్తం ఆదాయాన్ని బట్టి రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు జరిమానాగా ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రిటర్న్‌ను దాఖలు చేయడం వలన కొన్ని తగ్గింపులు, మినహాయింపులను క్లెయిమ్ చేసే అవకాశాన్ని కోల్పోతారు. అందుకే పెనాల్టీలు, వడ్డీ ఛార్జీలను తప్పించుకోవాలంటే IT రిటర్న్‌ను సమయానికి ఫైల్ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.