- తొందరగా ఫైల్ చేయడం బెటర్
- 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 31 చివరి తేది
బిజినెస్ డెస్క్, వెలుగు : కిందటి ఆర్థిక సంవత్సరం 2023–24 కి గాను ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయడానికి ఈ నెల 31 చివరి తేది. ఒకటే ఆదాయ మార్గం ఉన్న వారు డైరెక్ట్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ–ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి ఈజీగా ఐటీఆర్‌ను ఫైల్ చేసుకోవచ్చు. కానీ, శాలరీ, ఇంటి అద్దె, వ్యాపారం, షేర్ ఇన్వెస్ట్‌మెంట్స్, క్రిప్టో, లాటరీ వంటి ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్న వారు ఐటీఆర్‌ను సొంతంగా ఫైల్ చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా ట్యాక్స్ సిస్టమ్ గురించి అవగాహన లేని వారికి ఇది మరీ కష్టం. వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్నవారు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ముందు పాటించాల్సిన టిప్స్ పక్కన ఉన్నాయి.
1. రెడీగా డాక్యుమెంట్లు..
ఐటీఆర్‌లను ఫైల్ చేసే ముందు ఫామ్ 16, ఫామ్ 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్ డాక్యుమెంట్స్, క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్స్, హోమ్ లోన్ స్టేట్‌మెంట్ వంటి కీలకమైన డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోవాలి. వీటిని రివ్యూ చేయడం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది? 2023–24 లో ఎంత ట్యాక్స్‌ను చెల్లించారు? అనే విషయాలపై అవగాహన వస్తుంది.
2. ఐటీఆర్ ఫామ్ రెండా? మూడా?
సరైన ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ఆదాయ మార్గం బట్టి ఐటీఆర్‌ను ఎంచుకోవాలి. మొత్తం ఏడు ఐటీఆర్ ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు శాలరీకి అదనంగా క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉంటే ఐటీఆర్ 2 ఫామ్‌ను ఎంచుకోవాలి. అదే బిజినెస్ కూడా ఉంటే ఐటీఆర్ 3 ఫామ్‌ను ఎంచుకోవాలి. ఒక్క శాలరీ ఆదాయం పొందే వారు ఐటీఆర్ 1 ఫామ్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
3. ఫామ్ 26ఏఎస్..
ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) , ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) కట్ అయ్యిందో తెలుసుకోవడానికి ఫామ్ 26 ఏఎస్‌ను పరిశీలించాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లో ఇప్పటికే కట్ అయిన ట్యాక్స్ కలిసి ఉందో లేదో చూసుకోవాలి. ఫామ్ 26ఏఎస్‌ను ట్రేసెస్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
4. టీఐఎస్, ఏఐఎస్..
ఒక ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ పేయర్ సంపాదించిన ఆదాయ వివరాలను ట్యాక్స్‌పేయర్ ఇన్‌ఫర్మేషన్ సమ్మరీ (టీఐఎస్) లో చూసుకోవచ్చు. ఇంకా డిటైల్డ్‌గా తెలుసుకోవడానికి యాన్యువల్ ఇన్‌ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్) ను పరిశీలించొచ్చు. పాన్‌కార్డ్‌కు లింక్ అయి ఉన్న అని రకాల ఆదాయ మార్గాల వివరాలు వీటిలో ఉంటా యి. పొందిన శాలరీ, సేవింగ్స్‌పై వచ్చిన వడ్డీ, షేర్లు కొనడం, అమ్మడం, మ్యూచువల్ ఫండ్స్ ఆదాయం వంటి అన్ని రకాల ఆదాయ వివరాలు, ఇప్పటికే చెల్లించిన ట్యాక్స్ వివరాలు వీటిలో పొందుపర్చి ఉంటాయి. ఒకవేళ ఏఐఎస్‌లో డేటా తప్పుగా ఉందని అనిపిస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ–ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
5. ఫ్రీలాన్సర్ అయితే ఐటీఆర్4..
ఫ్రీలాన్సర్ లేదా కన్సల్టెంట్ అయితే ఐటీఆర్ ఫామ్ 4ను ఫైల్ చేయడం బెటర్. వీరి గ్రాస్ ఇన్‌కమ్ ఏడాదికి రూ.50 లక్షల లోపు ఉంటే (ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.75 లక్షలు) ఈ ఫామ్ ద్వారా మొత్తం ఆదాయంపై 50 శాతం ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు. దీనికి అదనంగా ఛాప్టర్ 5ఏ కింద డిడక్షన్లు కూడా పొందొచ్చు. ఏడాదికి ఆదాయం రూ.20 లక్షల దాటితే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
6. సాయం కోరండి..
తెలియకపోతే ఎక్స్‌పర్ట్‌ల సాయం కోరడం ఉత్తమమం. ట్యాక్స్ రిటర్న్స్‌లో తప్పులు ఉంటే భవిష్యత్‌లో అనేక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్నవారు తొందరగా ట్యాక్స్ రిటర్న్‌లను ఫైల్ చేయాలి. ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవడానికి టైమ్ ఉంటుంది.