
హైదరాబాద్, వెలుగు: సైన్యంలో చేరి దేశ సేవ చేద్దామనుకుంటున్న యువతకు అగ్నిపథ్ స్కీం.. ఒక అగ్ని పరీక్షగా మారిందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దేశ రక్షణ కోసం పనిచేసే సైన్యంలో కాంట్రాక్టు పద్ధతి దారుణమన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఆదివారం గాంధీ భవన్‌లో అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి మాట్లాడారు. అగ్నిపథ్‌పై పార్లమెంట్‌లో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం యువత జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు ఇవ్వాల్సి వస్తోందని నాలుగేండ్ల సర్వీసు కోసం వాళ్లని నియమించాలనుకోవడం దారుణమన్నారు. రక్షణ శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి సైనికులను కేంద్రం అవమానిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జ్ఞానం లేని వ్యక్తి చేతిలో దేశం పెడితే ఇలాగే ఉంటుందన్నారు. కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, మల్లు రవి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్‌యాదవ్, చిన్నారెడ్డి, సునీతారావ్ తదితరులు పాల్గొన్నారు.