నిజామాబాద్​లో పసుపు బోర్డు ఏర్పాటు భేష్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్​లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రెండు దశాబ్దాల నుంచి పోరాడుతున్న రైతుల కృషి ఫలించిందని తెలిపారు. గతేడాది తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానికి తాను లేఖ రాసినట్టు గుర్తు చేశారు. బుధవారం గాంధీ భవన్​లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2022లో బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని పేర్కొన్నారు. పసుపుకు సంబంధించి మార్కెటింగ్ వ్యవస్థ, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్, మద్దతు ధర కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ వెంటనే రీ ఓపెన్ చేయాలని ఆయన కోరారు.