హైదరాబాద్, వెలుగు: పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా రైతుల విజయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా మంగళవారం నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, పసుపు రైతుల తరపున తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పసుపు రైతుల ప్రయోజనాల కోసం బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి చాలాసార్లు విజ్ఞప్తులు చేశామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జిల్లా రైతుల పోరాటాలకు ప్రభుత్వం మద్దతు పలకడంతో పసుపు బోర్డు ఏర్పాటుకు పోటీలో ఉన్న అన్ని రాష్ట్రాలను, నగరాలను కాదనుకొని నిజామాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష అని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. నిజామాబాద్ పసుపు రైతులు పదేండ్లుగా పసుపు మద్దతు ధర, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు..