ముంబై: భారత యువ ఆటగాడు సంజూ శాంసన్ అంతర్జాతీయ కెరీర్‌పై దృష్టి పెట్టాలని లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజూ.. టీమిండియాకు సుదీర్ఘ కాలం సేవలందించడం గురించి ఆలోచించాలని గవాస్కర్ చెప్పాడు. మెరుగ్గా రాణించడంతోపాటు నిలకడగా పరుగులు చేయాలని.. అప్పుడే భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించవచ్చన్నాడు.
‘సంజూ శాంసన్ ఫెయిల్యూర్‌కు షాట్ల ఎంపికే కారణం. ఇంటర్నేషనల్ లెవల్‌లో కూడా అతడ్ని ఓపెనింగ్‌కు పంపట్లేదు. రెండు లేదా మూడో డౌన్‌లో శాంసన్‌ను బ్యాటింగ్‌కు దింపుతున్నారు. దీంతో అతడు వచ్చీ రాగానే షాట్లు కొట్టేందుకు యత్నించి విఫలమవుతున్నాడు. కానీ ఇది సరికాదు. ఒక ప్లేయర్ ఎంతటి గొప్ప ఫామ్‌లో ఉన్నా.. బ్యాటింగ్‌కు దిగిన తొలి బాల్ నుంచి హిట్టింగ్ చేయలేరు. రెండు, మూడు పరుగులు తీస్తూ క్రీజులో వేగంగా కదులుతూ ఉండాలి. కాళ్ల కదలికలు, పిచ్, బౌలింగ్‌పై అవగాహన వచ్చాకే హిట్టింగ్‌కు దిగాలి. శాంసన్ బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగవ్వాలి. షాట్ సెలెక్షన్‌పై దృష్టి పెట్టాలి. లేదంటే దేవుడు ఇచ్చిన ప్రతిభను అతడు వృథా చేసుకున్నట్లే అవుతుంది’ అని గవాస్కర్ హెచ్చరించాడు.