- చాలా ప్రాంతాలను కప్పేసిన పొగ మంచు
- ఆనంద్ విహార్‌లో ఆందోళనకర పరిస్థితులు
- జనాలకు శ్వాసకోశ సమస్యలు
- సరి బేసి రూల్ కోసం డిమాండ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. ఆదివారం ‘వెరీ పూర్’ కేటగిరిలోకి వెళ్లింది. శనివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 255గా నమోదు కాగా ఆదివారం ఉదయం 352గా రికార్డయింది. ఒక్కరోజులోనే గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయిందని సిస్టమ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్ఏఎఫ్ఏఆర్) తెలిపింది. ఆనంద్‌విహార్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
శనివారం ఏక్యూఐ 367 ఉండగా.. ఆదివారం ఉదయం ఏడు గంటలకు 405గా నమోదైంది. అదేవిధంగా, అక్షరధామ్‌లో 261, ఐజీఐ ఎయిర్‌పోర్టు వద్ద ఏక్యూఐ 324గా రికార్డయింది. ఈ రెండు ఏరియాలు ‘వెరీ పూర్’ కేటగిరిలో ఉన్నాయి. అలాగే.. ఢిల్లీలోని చాలా ప్రాంతాలను దట్టమైన పొగ మంచు కప్పేసింది. చాలా మందికి శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తినట్లు స్థానికులు తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జనవరి 1 దాకా పటాకులు కాల్చడంపై నిషేధం
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నది. ఢిల్లీ వాసులు సరిగ్గా శ్వాసతీసుకోలేకపోతున్నారు. మాస్క్‌లు పెట్టుకుంటున్నా.. రోజురోజుకూ పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రజలందరూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాహనాలకు సరి, బేసి రూల్ విధానం తీసుకురావాలని పలువురు ఢిల్లీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
నిర్మాణ పనులు ఆపేయాలని కోరుతున్నారు. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకుగాను దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని జనవరి 1 దాకా పటాకుల కాల్చడంపై ఢిల్లీ సర్కార్ నిషేధం అమల్లోకి తెచ్చింది. అదేవిధంగా, యుమనా నదిలోనూ కాలుష్య కారకాలు పెరగడంతో ప్రమాదకరమైన నురుగ పేరుకుపోతున్నది.
ముంబైలోనూ పడిపోయిన ఎయిర్ క్వాలిటీ
ముంబైలోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నది. గత మూడు రోజులుగా సిటీలోని చాలా ప్రాంతాలను పొగ మంచు కప్పేసింది. ఎప్పుడూ దీపావళికి ముందు పరిస్థితి ఇలాగే ఉంటదని ముంబై వాసులు చెప్తున్నారు. ఆదివారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 134గా నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. ముంబైలో మొత్తం 22 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 16 స్టేషన్లు పర్వాలేదని, నాలుగు స్టేషన్లు సంతృప్తికరంగా, ఒక స్టేషన్ పూర్, మరో స్టేషన్ గుడ్ అని రేటింగ్ఇచ్చాయి.
ముంబైలో సీజన్ మార్పు జరుగుతోందని, భూమిపై ఉన్న గాలి.. సముద్రపు గాలులతో రీ ప్లేస్ కావడంలో ఆలస్యం అయ్యిందని అధికారులు తెలిపారు. దీంతో చాలా చోట్ల ఎయిర్ క్వాలిటీ దెబ్బతిన్నదని వివరించారు. మలాడ్ వెస్ట్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 214గా నమోదైంది. బైకుల్లాలో 200, డియోనార్‌లో 194, బోరివలిలో 183, మాజ్ గావ్‌లో 160, బాంద్రా – కుర్లా కాంప్లెక్స్‌లో 155, వర్లిలో 149 పాయింట్లుగా రికార్డయింది.
కాగా, దీపావళిని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సూచనల మేరకు రాష్ట్రంలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఉంది.