నా కూతురు ఏ క్రికెటర్‌ను పెళ్లాడటం లేదు..: ప్రియా సరోజ్ తండ్రి

భారత క్రికెటర్ రింకూ సింగ్.. సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లాడనున్నట్లు గత రెండ్రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల ఈ జంట నిశ్చితార్థం జరిగినట్లు.. ఈ వేడుకకు సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు కథనాలు వచ్చాయి. ఇది నిజమే అనుకొని అభిమానులు సహా సహచర క్రికెటర్లు రింకూకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అయితే, చివరకు ఇవన్నీ పుకార్లని తేలింది. 

భారత క్రికెటర్ రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ఆమె తండ్రి తుఫానీ సరోజ్ ఖండించారు. క్రికెటర్ కుటుంబం పెళ్లి ప్రతిపాదనను పంపిందని,  దీనిపై ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు. నిశ్చితార్థం జరిగిపోయిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. 

వివాహ ప్రతిపాదనకు సంబంధించి రింకూ కుటుంబం ప్రస్తుతం అలీఘర్‌లో CJMగా పనిచేస్తున్న తన పెద్ద అల్లుడుతో మాట్లాడిందని ప్రియ తండ్రి తుఫాని సరోజ్ మీడియాకు వెల్లడించారు. ఒకవేళ పెళ్లి కుదిరితే.. మీడియాకే ముందు తెలియజేస్తామని, అప్పటిదాకా ఓపిక పట్టాలని అన్నారు. 

ఎవరీ ప్రియా సరోజ్‌?

ప్రియా సరోజ్‌ విషయానికొస్తే.. 1998లో వారణాసిలో జన్మించింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పట్టా పొందిన ఈమె, న్యాయవాద వృత్తిపై ఆసక్తితో ప్రియా అమిటీ యూనివర్శిటీ నుండి ఎల్‌ఎల్‌బి పూర్తి చేసింది. 

ఈమె రాజకీయ నాయకుడి కుమార్తె.. తండ్రి పేరు తుఫాని సరోజ్. ఈయన మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కెరకట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయాలపై ఆసక్తితో ప్రియా సరోజ్‌ 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PRIYA SAROJ (@ipriyasarojmp)

ఈమె మచ్లిశహర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తన ప్రత్యర్థి బీపీ సరోజ్‌పై 35850 ఓట్ల తేడాతో విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆమె దేశంలో అతి పిన్న వయస్కురాలైన పార్లమెంటేరియన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

ఇక రింకూ విషయానికొస్తే.. వచ్చే వారం నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. గతేడాది ఆగస్టు 2023లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రింకూ.. ఇప్పటివరకు రెండు వన్డేలు, 30 టీ20లు ఆడాడు. మొత్తంగా 562 పరుగులు చేశాడు.