తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం వాడీవేడిగా జరుగుతోంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు స్క్రీన్పై చూపించినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో మహిళ చనిపోవడం, ఆమె కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా.. సినీ ప్రముఖులు పరామర్శించకపోగా, అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టిన విషయమూ చర్చకు వచ్చినట్లు సమాచారం.
అదే సమయంలో ఈ సమావేశానికి హాజరైన సినీ ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వానికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్న నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు.. ప్రభుత్వ సాయంతోనే గతంలో సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది తమ డ్రీమ్ అని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలన్నారు.
మహిళ చనిపోవడం మమ్మల్ని బాధించింది: త్రివిక్రమ్, మురళీమోహన్
ఇదే సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ త్రివిక్రమ్, సీనియర్ నటులు మురళీమోహన్.. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం తమను బాధించిందని అన్నారు. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుందని మురళీమోహన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు.