మానవ సమాజంలో మనుషుల లైంగిక లక్షణాలు ఆధారంగా స్త్రీలు, పురుషులు అని సహజమైన విభజన ఉంది. దీన్నే జెండర్ బైనరీ అంటారు. స్త్రీలు, పురుషులతోపాటు ఎలాంటి లైంగిక పరమైన లక్షణాలు లేకపోవడం లేదా క్రోమోజోమ్ లోపం వల్ల స్త్రీ, పురుష లక్షణాలు కలిసి ఒక్కరిలోనే ఉండేవారిని థర్డ్ జెండర్‌గా వ్యవహరిస్తారు. ట్రాన్స్ జెండర్లకు కూడా ఒక గుర్తింపు తెచ్చే విధంగా వారిని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి మొదటి ప్రయోగంగా హైదరాబాదులోని గోషామహల్ స్టేడియంలో ఏర్పాటుచేసిన శిక్షణ, ఎంపిక ప్రక్రియకు పిలవగా 58 మంది హాజరైతే అందులో 44 మంది ఎంపిక అవ్వడం జరిగింది.
ట్రాన్స్జెండర్లు కూడా మనుషులేనని.. తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని తెలంగాణ ప్రభుత్వం కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా శిక్షణ ఇచ్చి ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రయోగం విజయవంతం అయితే దేశంలోనే వివిధ రాష్ట్రాలు కూడా ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ట్రాన్స్ జెండర్లు పెళ్లిలో, శుభకార్యాలలో డబ్బులు అడుక్కోవడం, వాటితోనే జీవించడం గమనించాం. వారికి సరైన అవకాశాలు లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. గౌరవప్రదంగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తే వారు మారతారని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంచలమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
ట్రాన్స్ జెండర్స్ సమస్యలు
ట్రాన్స్‌జెండర్ సామాజిక వెలికే కాకుండా కుటుంబం నుంచి కూడా వివక్షతకు గురవుతున్నారు. వీరు లింగపరమైన మైనార్టీలు. రాజకీయంగా ప్రభావ వర్గంగా లేరు. ప్రభుత్వ పథకాలు విధానాల్లో స్త్రీలతో పోలిస్తే వీరికి తగిన ప్రాధాన్యత అందటం లేదు. పుట్టుకతోనే సమాజం ఆపాదించిన లింగ పరమైన లక్షణాలకు భిన్నమైన లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి, తీవ్రమైన మానసిక సంఘర్షణకు, అంతర్గత ఉద్వేగానికి లోనవుతుంటారు. వీరు సమాజంలో బిక్షాటనకు , పేదరికానికి గురవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో అక్రమ రవాణాలో బలవుతున్నారు. ప్రజలందరికీ ఉద్దేశించిన సౌకర్యాలైన పాఠశాలలు, రవాణా సౌకర్యాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను స్త్రీ, పురుషులతో పోలిస్తే వీరు తక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం సమాజంలో వీరి పట్ల ఉన్న చిన్నచూపు, వివక్షత.
సర్టిఫికెట్లు ఐడెంటిటీ కార్డులు
ట్రాన్స్‌జెండర్‌కు ఐడి కార్డులు అందించేందుకు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్, ఎంటర్ప్రైజ్ అనే పోర్టల్ (నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్ జెండర్ పర్సన్స్) పథకం ద్వారా స్మైల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో ట్రాన్స్‌జెండర్ వారి సంక్షేమం, పునరావస పథకం, బిక్షాటకుల పునరావస పథకం అనే రెండు ఉప పథకాలు ఉన్నాయి. ట్రాన్స్ జెండర్స్ వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా పీఎం దక్ష అనే పథకంలో భాగంగా నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు.
తెలంగాణ సీఎం చొరవ గొప్పది
తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల పట్ల శ్రద్ధ చూపుతూ వారికి ట్రాఫిక్ అసిస్టెంట్లు ఉద్యోగాలు ఇవ్వడం, మిగతా రాష్ట్రాలనూ ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ దేశంలోని మిగతా ట్రాన్స్‌జెండర్లకు కూడా మరింత న్యాయం చేకూర్చే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానవీయంగా ఆలోచించే గొప్ప పాలకుడుగా ప్రజల ప్రశంసలకు పాత్రుడయ్యాడనడంలో సందేహం లేదు.
కేంద్రం ‘ద ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019’ తెచ్చింది
ఈ చట్టం ద్వారా మూడో లింగం వారికి చట్టబద్ధమైన గుర్తింపు, వివక్షతలకు వ్యతిరేక హక్కు, తల్లిదండ్రులు లేదా కుటుంబంతో నివసించే హక్కును కల్పించింది. ఈ చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం కేంద్ర సామాజిక న్యాయం సాధికారిక మంత్రిత్వ శాఖ 2020 సెప్టెంబర్ 25 న నియమ నిబంధనలు రూపొందించింది. సెక్షన్ 3 ప్రకారం మూడో లింగం వారి పట్ల వివక్షతను నిషేధించారు . సెక్షన్ 4 ప్రకారం మూడో లింగం వారికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది.సెక్షన్ 5 ప్రకారం మూడో లింగం వారిని గుర్తించే సర్టిఫికేట్ ను అందిస్తున్నారు. ఇంకా అనేక సెక్షన్ల ద్వారా ట్రాంన్స్జెండర్లకు ఈ చట్టం భద్రత కల్పిస్తున్నది. సంక్షేమ కార్యక్రమాలు గరిమ గృహ పథకం ముఖ్య ఉద్దేశం కుటుంబం వదిలించుకున్న మూడో లింగం తో పాటు అనాథలకు ప్రాథమిక సౌకర్యాలైన నివాసం, భద్రత, ఆహారం తదితర సౌకర్యాలు కల్పించడం. ట్రాన్స్ జెండర్స్ విద్యార్థులకు సెకండరీ, సీనియర్ సెకండరీ, డిప్లమా, డిగ్రీ, పీజీ స్థాయిలో స్కాలర్షిప్లు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏడాదికి రూ.13,500 అందిస్తున్నారు.
పట్ల నాగరాజు(నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు)