- ఫ్రీడం ఫైటర్స్‌ను ఆర్ఎస్ఎస్ చీఫ్ అవమానించారు
- దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని అడ్డుకొనే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉన్నదని వ్యాఖ్య
న్యూ ఢిల్లీ: అయోధ్య రామమందిరం ప్రారంభం రోజే దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఆర్ఎస్ఎస్చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశ ప్రజలను భగవత్ అవమానించారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయని పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ వల్లే భగవత్ దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగం గురించి తన అభిప్రాయాలను చెప్పగలుగుతున్నారని అన్నారు. ఇవే వ్యాఖ్యలు వేరే దేశంలో చేస్తే ఆయనను ఇప్పటికే అరెస్ట్ చేసి ఉండేవారని చురకలంటించారు.
బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతున్నదని, అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సిద్ధాంతం అయితే.. రెండోది ఆర్ఎస్ఎస్ భావజాలం అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యంపై భగవత్అనుచితంగా మాట్లాడి ఫ్రీడం ఫైటర్స్ అందరినీ అవమానపరిచారని ఫైర్ అయ్యారు. ఇకనైనా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం ఆపాలని సూచించారు. ‘‘నేడు అధికారంలో ఉన్నవారు (బీజేపీ) త్రివర్ణ పతాకానికి వందనం చేయరు. జాతీయ జెండాపై వారికి గౌరవం లేదు. రాజ్యాంగాన్ని నమ్మరు. వారికి భారతదేశంపై మనకంటే భిన్నమైన దృక్పథం ఉన్నది. వారు దేశాన్ని ఓ వ్యక్తి నీడలో నడపాలని అనుకుంటున్నారు. ఈ దేశం గొంతును అణచివేయాలని
అనుకుంటున్నారు. మేం బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్తో పోరాడుతున్నాం” అని రాహుల్ పేర్కొన్నారు.
మా పోరాటంలో న్యాయం ఉంది
కాంగ్రెస్ నేతలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ఆపగలిగే శక్తి కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. తమ పోరాటంలో న్యాయం ఉందని, దాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ భారత ప్రజలతో కలిసి పనిచేసిందని, రాజ్యాంగ పునాదులపై దేశ విజయాన్ని నిర్మించిందని చెప్పారు. కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం దానికి ప్రతీక అన్నారు. ఈ భవనం కేవలం గాంధీ, నెహ్రూ, పటేల్జీ యేకాక.. కాంగ్రెస్ ప్రజల రక్తం నుంచి రూపుదిద్దుకుందని తెలిపారు.
మన ఎన్నికల వ్యవస్థల్లో తీవ్ర సమస్యలు
మన దేశ ఎన్నికల వ్యవస్థలో తీవ్ర సమస్యలున్నాయని రాహుల్‌గాంధీ అన్నారు. ఎలక్షన్‌కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఏదో తప్పు జరిగిందని అనుమానం వ్యక్తంచేశారు. ‘‘లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల సమయానికి మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. దానికి సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు ఈసీ నిరాకరిస్తున్నది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ఈసీ బాధ్యత’’ అని పేర్కొన్నారు. ‘‘ఓటర్ జాబితాలను మాకు ఇవ్వడానికి ఈసీ ఎందుకు నిరాకరిస్తున్నది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితాలను మాకు, మిగిలిన ప్రతిపక్షాలకు ఎందుకు ఇవ్వడం లేదు? దీనివల్ల ఈసీకి ఏమైనా నష్టమా? ఎన్నికల్లో పారదర్శకత పాటించడం ఈసీ విధి. మహారాష్ట్రలో రెండు ఎలక్షన్స్ మధ్యలో కోటి మంది ఓటర్లు ఎలా పెరిగారో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం” అని అన్నారు. నేరాలపై విచారణ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు.. ప్రతిపక్షాలు, ఆ పార్టీల నేతలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దేశంలో తిరగలేరు: ఖర్గే
దేశ స్వాతంత్ర్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే దేశంలో తిరగడం కష్టమవుతుందని హెచ్చరించారు. ‘‘స్వాతంత్ర్యంతో సంబంధంలేని, దానికోసం పోరాడని వ్యక్తులే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. నేను ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రకటన చదివాను. రామాలయం ప్రారంభంతో నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన అన్నారు. ఆయన మోదీతో కలిసి ఆలయాన్ని ప్రారంభించారు. 2014లో తాను ప్రధాని అయ్యాకే స్వాతంత్ర్యం వచ్చిందని మోదీ నమ్ముతారు’’ అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ వికృత రూపం బయటపడింది: బీజేపీ చీఫ్ నడ్డా
బీజేపీపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లతో ఆ పార్టీ వికృత రూపం బయటపడిందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. రాహుల్ చేస్తున్న పనులు, చెప్పే మాటలన్నీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా, సమాజాన్ని విభజించేలా ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ గురించి దేశ ప్రజలకు తెలిసిన విషయాన్ని మరోసారి స్పష్టంగా చెప్పినందుకు రాహుల్ గాంధీని అభినందిస్తున్నా అంటూ ఎద్దేవా చేశారు. "రాహుల్ గాంధీకి, ఆయన చుట్టూ ఉన్నవారికి అర్బన్ నక్సల్స్‌తో సంబంధం ఉందనేది తెలిసిన విషయమే. దేశం పరువు తీయాలని, కించపరచాలని వారు ప్రయత్నిస్తున్నారు. దేశానికి వ్యతిరకంగా రాహుల్ పదే పదే చేస్తున్న పనులు దీనిని బలపరుస్తున్నాయి. దేశాన్ని నిర్వీర్యం చేయా లనుకునే శక్తులను ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్‌ది. అధికారం కోసం దేశ సమగ్రతను దెబ్బతీయాల ని చూస్తున్నది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ద్రోహానికి పాల్పడుతోంది" అని నడ్డా అన్నారు.