యాదాద్రి కాదు.. ఇక నుంచి యాదగిరిగుట్ట

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు మార్చనున్నట్లు ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. ఎన్నికల తర్వాత యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు మంత్రి. కేసీఆర్ ప్రభుత్వం రాక ముందే యాదగిరిగుట్టగానే ఉందని.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత యాదాద్రిగా పేరు మార్చారని.. పేరు మార్చటంతోపాటు యాదాద్రి అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ.. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చారని.. ఇప్పుడు పాతపేరు యాదగిరిగుట్టను తిరిగి తీసుకొస్తామని వెల్లడించారాయన. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే.. పేరు మార్పుతో జీవో విడుదల చేయటం జరుగుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.