ఢిల్లీ పీఠానికి యూపీ తీర్పే కీలకం : ఐ.వి.మురళీకృష్ణ శర్మ

ఢిల్లీ పీఠానికి యూపీ తీర్పే కీలకం : ఐ.వి.మురళీకృష్ణ శర్మ

ఏదైనా లక్ష్యం సాధించాలంటే అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకోవడమే విజేతల లక్షణం. ఈ సూత్రం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. దేశానికి గుండెకాయ లాంటి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌‌‌‌లో రాబోయే లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే ఢిల్లీ పీఠం దక్కుతుంది. ఈ సత్యం తెలిసిన ప్రధాన రాజకీయ పార్టీలు ‘కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి’ అంటూ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించాయి. 403 అసెంబ్లీ, 80 లోక్‌‌‌‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌‌‌‌  కేంద్రంలో అధికారానికి ఎప్పుడూ సోపానమే. స్వాతంత్య్రానంతరం దేశ ప్రధానమంత్రులుగా 14 మంది సేవలందించగా అందులో 9 మంది యూపీకి ప్రాతినిధ్యం వహించిన ఎంపీలే కావడం విశేషం. ఇది దేశ రాజకీయాల్లో 

ఆ రాష్ట్ర ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.

యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధిక స్థానాల గెలుపుపై ధీమాగా ఉంది. ఆ పార్టీకి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంగా కాంగ్రెస్‌‌‌‌ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ముందుకు సాగుతోంది.  కేంద్రంలో 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2017, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. 2009 పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో 10 స్థానాలే గెలిచిన బీజేపీ 2014లో 71,  2019లో 62 ఎంపీ సీట్లను గెల్చుకుంది. దేశవ్యాప్తంగా 370కు పైగా స్థానాలపై దృష్టి పెట్టిన బీజేపీ ఈసారి యూపీలో 70 స్థానాలపై గురిపెట్టింది.

ఎన్నికల బరిలో ‘పీడీఏ’ ఫార్ములా

యూపీలో ‘పీడీఏ’`పిచ్డే (వెనుకబడిన తరగతులు), దళితులు, అల్పసంఖ్యాక్‌‌‌‌ (మైనార్టీలు) ఫార్ములాతో ఎన్నికల బరిలో దిగాలని ‘ఇండియా’ కూటమి సిద్ధమైంది. ఈ సూత్రానికి అనుగుణంగానే ఎస్పీ ఇటీవల ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసింది. యాదవేతర ఓబీసీ సామాజికవర్గంతోపాటు జాట్​యేతర దళిత సామాజికవర్గంలో బీజేపీ అధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి ‘ఇండియా’ కూటమి వ్యూహాలను రచిస్తోంది. 

ఈ వర్గాలలో ధరలు పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలతో బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నవారిని బూత్‌‌‌‌స్థాయిలో గుర్తించి వారికి చేరువవడానికి ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో సోషల్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌కు సంబంధించి సీఎస్‌‌‌‌డీఎస్‌‌‌‌ డేటా ప్రకారం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం, యాదవ్‌‌‌‌ ఓట్లను గంపగుత్తగా పొందిన ఎస్పీ ఆ తర్వాత దళితులు, ఓబీసీ వర్గాలను ఆకర్షించడంలో విఫలమైంది. 2022 శాసనసభ  ఎన్నికల సందర్భంగా పీపుల్స్‌‌‌‌ పల్స్‌‌‌‌ సంస్థ రాష్ట్రంలో పర్యటించినప్పుడు అసెంబ్లీకి సమాజ్‌‌‌‌వాదీ పార్టీ నేతృత్వంలోని మహాఘట్‌‌‌‌ బంధన్‌‌‌‌కు ఓటు వేస్తామని, 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌‌‌‌కే ఓటు వేస్తామని చెప్పడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. 

ఈ పరిణామంతో ముస్లింలు దూరమైతే భవిష్యత్తులో తమ ఉనికికే ప్రమాదమని ఎస్పీ కంగారు పడుతోంది. మరోవైపు ముస్లిం, దళిత కాంబినేషన్‌‌‌‌లో  బీఎస్పీ ఎక్కువగా ముస్లిం అభ్యర్థులను లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బరిలోకి దింపనుందనే ప్రచారంతో మైనార్టీ ఓట్ల చీలికపై ‘ఇండియా’ కూటమి ఆందోళన చెందుతోంది.

బీజేపీ ‘రామ్‌‌‌‌, రోటీ, జాతీయత’ నినాదం

ఉత్తరప్రదేశ్‌‌‌‌ రాజకీయాలు భావోద్వేగాలుతో, మత, కుల సమీకరణాలతో ఉంటాయి. బీజేపీ ‘రామ్‌‌‌‌, రోటీ, జాతీయత’ నినాదానికి ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉంది.  యాదవ్‌‌‌‌, ముస్లిం వర్గాలలో పట్టుపై ధీమాగా ఉన్న  ‘ఇండియా’ కూటమి ఓబీసీలలో బలం కోసం ప్రయత్నిస్తున్నా ఈ సామాజిక వర్గాల్లో  బీజేపీని బలహీనపర్చడం అంత సులభం కాదు. దళితులలో ఆదరణ ఉన్న బీఎస్పీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్నా ఆ స్థానాన్ని ‘ఇండియా’ కూటమి భర్తీ చేస్తేనే సానుకూల ఫలితాలు ఉంటాయి.  

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు వర్గాలు కాంగ్రెస్‌‌‌‌ను ఆదరించకపోవడం, ఎస్పీని విశ్వసించకపోవడం ‘ఇండియా’ కూటమికి యూపీలో ప్రతికూలంగా మారనున్నాయి.  ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటేనే రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక స్థానాలు రాకుండా అడ్డుకట్ట వేయడంలో ‘ఇండియా’ కూటమి సఫలమవుతుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టు యూపీలో గత వైభవం కోసం కాంగ్రెస్‌‌‌‌, రాష్ట్రంలో పట్టు కోల్పోతే రాజకీయ మనుగడకే ప్రమాదమనే భయంతో ఎస్పీ  సర్వశక్తులను కూడగట్టుకొని బరిలోకి దిగుతున్నాయి. 

అయోధ్య రామాలయం నిర్మాణంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగీ ఆదిత్యనాథ్‌‌‌‌ నాయకత్వంలో  మరోసారి యూపీలో మేమే అనే విశ్వాసంతో బీజేపీ ధీమాగా ఉంది. కేంద్రంలో అధికారం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్‌‌‌‌ ప్రజలు 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో ఏ పార్టీని ఆదరిస్తారో వేచి చూడాలి.

యూపీలో పట్టు కోల్పోయిన కాంగ్రెస్​

ఉత్తరప్రదేశ్​లో 90వ దశకం వరకు ఆధిపత్యం కొనసాగించిన కాంగ్రెస్‌‌‌‌ పార్టీ.. అయోధ్య రామాలయం, మండల కమిషన్‌‌‌‌ అంశాలతో ఆ రాష్ట్రంలో పట్టు కోల్పోయింది. గాంధీ కుటుంబానికి గట్టి పట్టున్న అమేథీలో గత ఎన్నికల్లో రాహుల్‌‌‌‌ గాంధీ ఓడిపోవడం ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని చెప్పడానికి నిదర్శనం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌‌‌‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని 114 స్థానాల్లో పోటీ చేసి 7 సీట్లే సాధించిన కాంగ్రెస్‌‌‌‌ 2022లో ఒంటరిగా పోటీ చేసి 2 స్థానాలకే పరిమితమైంది. 

లోక్‌‌‌‌సభ ఎన్నికలకు సంబంధించి 2009లో 21 స్థానాలు, 2014లో 2 స్థానాల్లో, 2019లో ఒక స్థానం గెలిచింది. రాష్ట్రంలో రోజురోజుకు పార్టీ పరిస్థితి దిగజారుతున్న దశలో జీవన్మరణ సమస్యగా మారిన 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో యూపీలో మెరుగైన స్థానాలు సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌‌‌‌ రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయిన సమాజ్‌‌‌‌వాదీ పార్టీ(ఎస్పీ)తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగనుంది.  

బీజేపీ ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్‌‌‌‌, సమాజ్‌‌‌‌వాదీ పార్టీలు సీట్ల సర్దుబాటుపై సిగపట్లే పట్టాయి. మూడు నెలల క్రితం జరిగిన మధ్యప్రదేశ్‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ ఒంటెత్తు పోకడలతో కూటమి ధర్మాన్ని విస్మరించిందని ఒంటరిగా పోటీ చేసిన ఎస్పీ పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌‌‌‌కు 10 సీట్లే ఇస్తామని భీష్మించింది. ఈ నేపథ్యంలో పలు జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేలలో యూపీలో మరోమారు బీజేపీ అధిక స్థానాలు సాధించనుందనే వార్తలతో రెండు పార్టీలు మెట్టుదిగి సయోధ్య కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సమాజ్‌‌‌‌వాదీ పార్టీ 62 స్థానాల్లో, కాంగ్రెస్‌‌‌‌ 17 స్థానాల్లో, మరో చోట ఆజాద్‌‌‌‌ సమాజ్‌‌‌‌ పార్టీ జతకట్టి బరిలోకి దిగనున్నాయి.

యూపీపై రాహుల్ నజర్​

రాహుల్‌‌‌‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌‌‌‌ జోడో యాత్ర’ రెండో దశ యూపీపై ప్రధాన దృష్టి సారించింది. బీజేపీ పాలనపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను చేరదీసేలా ‘భారత్‌‌‌‌ జోడో న్యాయ్‌‌‌‌ యాత్ర’ పేరుతో రాష్ట్రంలో 11 రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రధాన నియోజకవర్గాల మీదుగా సాగేలా యాత్రను రూపొందించారు. యాత్రలో  రాహుల్‌‌‌‌ గాంధీ యూపీ సీఎం యోగి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతున్నారు. సామాజిక వివక్ష,  నిరుద్యోగ సమస్యలను ప్రస్తావిస్తూ యువతకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కాంగ్రెస్‌‌‌‌ ప్రధాన ఎజెండా అయిన కులగణను ప్రస్తావిస్తున్నారు. జోడో యాత్రలో కాంగ్రెస్‌‌‌‌తో పాటు ఎస్పీ కార్యకర్తలు కూడా భారీగా పాల్గొనడంతో ఉత్సాహంగా ఉన్న రాహుల్‌‌‌‌ గాంధీ పోలీస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌, ఆర్వో/ఏఆర్వో ఉద్యోగ పరీక్షలలో పేపర్‌‌‌‌ లీక్‌‌‌‌ అంశాన్ని లేవనెత్తుతూ యోగీ సర్కార్‌‌‌‌ను ఇరుకున పెడుతున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే అఖిలేశ్​యాదవ్‌‌‌‌ నేతృత్వంలోని మహాఘట్‌‌‌‌బంధన్‌‌‌‌ కూటమితో పాటు కాంగ్రెస్‌‌‌‌కు వచ్చిన ఓట్లను కలిపితే దాదాపు 39 శాతం వచ్చాయి. అంటే సుమారు 30 ఎంపీ స్థానాల్లో ‘ఇండియా’ కూటమి ఆధిక్యత కనిపిస్తోంది. అయితే ఓట్ల శాతం సీట్లుగా మారుతాయని కచ్చితంగా చెప్పలేం.

2014 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో యూపీలో దాదాపు 20 శాతం ఓట్లు పొందిన బీఎస్పీ అప్పుడు ఒక్క సీటు కూడా సాధించలేకపోవడం ఇక్కడ గమనార్హం. ‘ఇండియా’ కూటమి 127 అసెంబ్లీ స్థానాలను కలిగుంది. ఈ లెక్కన రాష్ట్రంలో కూటమి 25 స్థానాల్లో,  ఎన్‌‌‌‌డీఏ 55 స్థానాల్లో ఆధిపత్యంలో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన అప్నాదళ్‌‌‌‌,  నిషాద్‌‌‌‌ పార్టీలతో పాటు ఇప్పుడు ఎస్‌‌‌‌బీఎస్పీ, ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌డీ (గతంలో మహాఘటబంధన్‌‌‌‌తో ఉండేవి) కూడా ఎన్‌‌‌‌డీఏలో ఉన్నాయి. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని కూటముల బలాబలాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. 

- ఐ.వి.మురళీకృష్ణ శర్మ,
రీసెర్చర్‌‌‌‌, పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌
రీసెర్చ్‌‌‌‌ సంస్థ