- అధికారులపై దాడులు చేసి,దూషించడం సరికాదు
- ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్
- సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతి కల్పించడం పట్ల హర్షం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేసే అధికారులపై దాడులు చేయడం.. దూషించడం సరికాదని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. ప్రభుత్వలో ఉన్న పాలకులు తీసుకున్న నిర్ణయాలను అమలు చెయ్యడం అధికారుల బాధ్యత అన్నారు. ఆయన శనివారం నాంపల్లిలో మీడియాతో మాట్లాడారు. వికారాబాద్, సిరిసిల్ల ఘటనలు తమను కలచి వేశాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మరోసారి దాడులు జరిగితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు సరైనవి కావని.. ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న తహసీల్దార్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేశ్ పాక పేర్కొన్నారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతులను కల్పించాలని కోరారు.
ఇటీవల రెవెన్యూ అధికారులపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చార్మినార్ జోన్‌లో ఆపిన ఇదే పదోన్నతులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -ఎన్నికల సమయంలో తహసీల్దార్లను బదిలీలు చేశారని.. ఇప్పటికీ వారిని సొంత జిల్లాలకు బదిలీ చేయలేదన్నారు. వెంటనే వారిని సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నుంచి 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా అప్‌గ్రేడ్ చేయడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కొన్ని రోజులుగా నడుస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు నాయబ్ తహశీల్దార్ పదోన్నతి కల్పించడం, అదేవిధంగా త్వరలో మరోసారి 100 మంది డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతి సాధించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో, వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి తెలిపారు.