సీఎంకు అంగన్​వాడీల సత్తా చూపిస్తాం : పి.జయలక్ష్మి

నల్గొండ అర్బన్, వెలుగు : సమస్యలు పరిష్కరించకుంటే సీఎం కేసీఆర్‌‌ అంగన్‌వాడీల సత్తా ఏంటో చూపిస్తామని  సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్  పి.జయలక్ష్మి  హెచ్చరించారు.  జిల్లా కేంద్రంలోని సీడీపీవో కార్యాలయం ఎదుట 13 రోజులుగా చేస్తున్న సమ్మెలో శనివారం పాల్గొని మాట్లాడారు.  అంగన్‌వాడీల గురించి మాజీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసని, సమస్యలను తీర్చకుంటే కేసీఆర్‌‌కు కూడా తెలుస్తుందన్నారు.  తమకు రెగ్యులరైజ్ చేయడంతో పాటు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, టీచర్లకు రూ.10 లక్షలు, ఆయాలకు రూ.5 లక్షల రిటైర్‌‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

మంత్రి సత్యవతి రాథోడ్  అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన అధికారులు తాము చేసే ప్రతి పనిని చేయాలన్నారు. తాళాలు పగలగొట్టిన వారిపై ఇప్పటికే కేసులు పెట్టామన్నారు.  ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్‌ ప్రభుత్వం తమనెందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. సమ్మె చేస్తున్న నాయకులను కాదని మంత్రి చర్చలు జరిపితే చలో హైదరాబాద్, చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.  

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి,  జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, నేతలు ఎండి సలీం, దండెంపల్లి సత్తయ్య, జిల్లా అధ్యక్షురాలు పొడిచెట్టి నాగమణి, విజయలక్ష్మి, నాంపల్లి చంద్రమౌళి, పోతేపాక వినోద్ కుమార్, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ ,సలివోజు సైదాచారి, ప్రమీల, ప్రకృతాంబ, యాదమ్మ, విజయ, మంగ, భారతి, రేణుక, కళ్యాణి, సునీత, సరిత తదితరులు పాల్గొన్నారు.