
- రంగారెడ్డి జిల్లాలో కార్మిక సంఘాల ఆందోళన
మంచాల / శంకర్‌పల్లి, వెలుగు: ఏండ్లుగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ గ్యార పాండు డిమాండ్చేశారు. పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె పిలుపులో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా మంచాలలో కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ కార్మికులు గ్రామాలను శుభ్రం చేసి అద్దంలా తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా వివక్షత చూపుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది గ్రామపంచాయతీ సిబ్బంది ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 51ను ఉపసంహరించుకోవాలన్నారు. పంచాయతీల్లోని ప్రతి ఉద్యోగి, కార్మికుడికి కనీస వేతనం రు.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తీర్చేవరకు సమ్మె ఆగదన్నారు. సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ, గ్రామ పంచాయతీ యూనియన్ మండల అధ్యక్షుడు ఖాజా పాషా, కార్యదర్శి భాస్కర్, నేతలు మాధవి, రవి తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరంలో..
మహేశ్వరంలో సీఐటీయూ కన్వీనర్ ఏర్పుల శేఖర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అశోక్, బుజ్జమ్మ పాల్గొన్నారు.
శంకర్పల్లిలో..
పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. జీపీ కార్మికులు నిరవధిక సమ్మెను ప్రారంభించి మాట్లాడారు. కార్మికులను పర్మినెంట్ చేయకుండా, జీతాలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. అనంతరం ఎంపీడీవో వినతి పత్రం అందించారు. కార్మికులు మల్లారెడ్డి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.