బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి : జేఏసీ

బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి : జేఏసీ
  • తెలంగాణ కురుమ రాజకీయ జేఏసీ విజ్ఞప్తి

బషీర్​బాగ్, వెలుగు: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ కురుమ రాజకీయ జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని కురుమలకు ఏకైక ప్రతినిధి ఐలయ్య అని తెలిపింది. జేఏసీ నేత జక్కుల వంశీకృష్ణ ఆధ్వర్యంలో గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి కురుమలకు ప్రధాన్యం ఇవ్వాలని కోరారు. కురుమ కులస్తులను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాక, కర్ణాటకలో కాంగ్రెస్​రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు.

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్యది, తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన బెల్లి లలితది ఇదే కులమన్నారు. కురుమలకు ప్రతినిధిగా ఉన్న బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని డిమాండ్​చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ గోరేగే మల్లేశ్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, జేఏసీ నాయకులు మల్లేశ్, రఘునాథ్, కొంగల పాండు, పర్వతాలు, కొచ్చిక శ్రీనివాస్, మాదారం కృష్ణ, హెచ్ పీకేఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.