ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ వచ్చి పదేండ్లు పూర్తయినా, అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయిందని ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక అభిప్రాయపడింది. కల్వకుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుందని, బీఆర్ఎస్పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని మండిపడింది. తెలంగాణ ద్రోహులను అందలమెక్కించిన కేసీఆర్పాలనను అంతం చేయడంలో ఉద్యమకారుల పాత్ర ఉందని పేర్కొంది. గోధుమల కుమారస్వామి, దోనేటి కృష్ణలత ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ఉద్యమకారుల ఆకాంక్షలు, అమలు, సమస్యలు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
పాశం యాదగిరి, జస్టిస్ చంద్రకుమార్, సైదులు, అన్వర్ పటేల్, విట్టల్, రాపోలు ఆనంద్ భాస్కర్, కోల్లా జనార్దన్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఆరు గ్యారంటీలతోపాటు, 250 గజాల స్థలం ఇవ్వాలని కోరారు. రాహుల్ గాంధీ యూత్ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.
అలాగే రాయితీలతో కూడిన రుణాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించటానికి పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య, తెలంగాణ విఠల్, పృథ్వీరాజ్ తో కమిటీ వేయాలని తీర్మానించారు. అలాగే ఉద్యమకారులపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేసేందుకు జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.