ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
  • ఉద్యమకారుల జేఏసీ డిమాండ్​

ముషీరాబాద్, వెలుగు : ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల జేఏసీ డిమాండ్​చేసింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ వేతనం కింద రూ.30 వేలు ఇవ్వాలని కోరింది. బుధవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల స్థితిగతులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జేఏసీ సెక్రెటరీ జనరల్ ప్రఫుల్ రాంరెడ్డి అధ్యక్షత వహించారు. 

జేఏసీ చైర్మన్​సుల్తాన్​యాదగిరి మాట్లాడుతూ.. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఉద్యమంలో పనిచేసి లబ్ధి పొందని కళాకారులకు సాంస్కృతి సారధిలోని వివిధ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించి నాలుగు గదుల ఇల్లు అందజేయాలన్నారు. ప్రభుత్వ పథకాలలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 

100 ఎకరాల్లో అమరవీరుల స్మృతి వనం ఏర్పాటు చేసి, ప్రతిఒక్కరికీ 20 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. జేఏసీ రాష్ట్ర నాయకులు సోమన్న, యాదగిరి, చంద్రన్న, ప్రసాద్, మాధవి, యాదగిరి, ఎ.యాదగిరితోపాటు జిల్లాల ఉద్యమకారులు పాల్గొన్నారు.