చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని రాస్తారోకో

చేర్యాల, వెలుగు : సిద్దిపేట జిల్లాలో అన్ని  అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్ష జేఏసీ శుక్రవారం స్థానిక గాంధీ సెంటర్ లో  రాస్తారోకో నిర్వహించింది. జేఏసీ చైర్మన్​ డాక్టర్​ ఆర్ పరమేశ్వర్, మద్దూరు జడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు తాలూకాగా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగు వెలిగిన చేర్యాల రోజురోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతోందన్నారు. ఈ ప్రాంతాన్ని ముక్కలు చేసి అసెంబ్లీ జనగామ, ఎంపీ భువనగిరి, వ్యవసాయ డివిజన్ గజ్వేల్ లో, ఏసీపీ, విద్యుత్ డివిజన్ హుస్నాబాద్ లో, జిల్లా కేంద్రం సిద్ధిపేటకు విడదీసి నాశనం చేశారని మండిపడ్డారు.

చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని ఐదేండ్లుగా కోరుతున్నా మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు పార్టీ హైకమాండ్​ను ఒప్పించి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్నారు. లేకపోతే పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేశారు. అఖిల పక్ష పార్టీల నాయకులు ఏ. మల్లారెడ్డి, పి.ఆగం రెడ్డి, అందె అశోక్, వెంకట మావో,  యూ.భాస్కర్ రెడ్డి, చెవిటి లింగం, కళావతి, నర్సింగ్ రావు, బి.అంజయ్య గౌడ్ , పి.రాములు చారి, బాల నర్సయ్య, ఆలేటి యాదగిరి, టి. ప్రశాంత్, రాము, కే. ఉపేంద ర్, కే. మల్లేశం తదితరులు పాల్గొన్నారు.