- 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: తాము కోల్పోయిన స్థానికతను తిరిగి సాధించడానికి జీవో 317ను వెంటనే రద్దు చేయాలని 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం మంత్రి వర్గ సబ్ కమిటీ వేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ మహా నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 317 జీవో కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడిందని గుర్తు చేశారు.
జేఏసీ అధ్యక్షుడు విజయకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ..317పై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని కోరారు. ఈ సమస్యను సీఎం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదని, స్థానికత కోల్పోవడం వల్ల ఉద్యోగ, టీచర్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని..లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు.