
- తేల్చి చెప్పిన ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్
- క్రమబద్ధీకరించకుంటే సెప్టెంబర్‌లో లక్షమందితో గర్జన సభ
- హనుమకొండలో ఆత్మ గౌరవ సభ నిర్వహించిన జేఏసీ
హనుమకొండ, వెలుగు : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాటం చేశామని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో తమకు ఆత్మగౌరవం లేకుండా పోయిందని ఔట్సోర్సింగ్ఉద్యోగుల జాయింట్యాక్షన్కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య అన్నారు. ప్రభుత్వం తమ సేవలను గుర్తించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడ్తామని స్పష్టం చేశారు. హనుమకొండ ఆర్ట్స్‌కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య మాట్లాడుతూ ఔట్సోర్సింగ్వ్యవస్థనే తీసేసి, ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్వెంటనే ఆ హామీ నెరవేర్చాలన్నారు. తమను రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల రాష్ట్రంలో లక్షన్నర మందికి అన్యాయం జరుగుతోందన్నారు.
ఏజెన్సీల వ్యవస్థను ఎత్తివేసి రెగ్యులరైజ్ చేస్తే తాము ప్రభుత్వం వెన్నంటే ఉంటామని, లేకపోతే సెప్టెంబర్‌లో లక్ష మందితో హైదరాబాద్‌లో ఔట్సోర్సింగ్ఉద్యోగుల గర్జన సభ నిర్వహించి, తమ సత్తాచాటుతామని స్పష్టం చేశారు. అనంతరం జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ దోయిపడి శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అవార్డులు వస్తున్నాయంటే.. అందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కృషి ఉందన్నారు. మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, మూడేండ్ల లోపు ఉన్న వారికి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. మృతి చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు 2020 పీఆర్సీ ప్రకారం అందరికీ బకాయిలు చెల్లించాలన్నారు. కొత్తగా ఏర్పడిన పీఆర్సీ –2023 ప్రకారం జులై నుంచే బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు రాజిరెడ్డి, జగదీశ్,రాజేశ్, శ్రీకాంత్‌చారి, రాజ్మహమ్మద్, జే.సంధ్య, వీరస్వామి, స్వామి పాల్గొన్నారు.