తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో 50 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయం. గ్రామాల్లో జరిగే ప్రభుత్వ పనుల్లో గ్రామపంచాయతీ కార్మికుల పాత్ర ఎంతో కీలకం. తెలంగాణ ఉద్యమంలోనూ వీరు క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామాల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు.
ఎక్కువ శాతం దళితులే..
గ్రామపంచాయతీ కార్మికుల్లో నూటికి 80% దళిత అట్టడుగు వర్గాలకు చెందిన వారే. మురుగు కాలువలలో పనిచేస్తూ అనారోగ్యాలను లెక్కచేయకుండా చాలీచాలని వేతనాలతో జీవనాన్ని కొనసాగిస్తారు. మురుగును చూస్తేనే చీదరించుకునే రోజుల్లో మురుగునీటితోపాటు వ్యర్ధాలను పారిశుద్ధ్య పనులను నిత్యం చేస్తూ తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కృషి చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు వారు కోరే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత. గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి.
నిరవధిక సమ్మె
నూతనంగా తీసుకువచ్చిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే వివిధ కేటగిరీలుగా ఎప్పటిలాగే గ్రామపంచాయతీ సిబ్బందిని కొనసాగించాలని కొన్ని రోజులుగా వారు నిరవదిక సమ్మె చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం గ్రామాల విస్తరణతో పాటు జనాభా పెరిగి కొత్త సిబ్బందిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. జీవో నెంబర్ 51 విడుదలకు ముందు పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించలేదు. అదనంగా నియమించిన కార్మికులకు పంచాయతీ కార్మికులుగా గుర్తించి అందరికీ సమానంగా వేతనాలు ఇవ్వడం లేదు. వేతనాలు ప్రభుత్వమే బడ్జెట్ లో కేటాయించాలి. కొత్తగా నియమితులయ్యే వారికి సంబంధించి గ్రామపంచాయతీ తీర్మానం చేసి డీపీవో ఆమోదం ద్వారానే నియమకాలను అమలు చేయాలి.
మల్టీపర్పస్ విధానంతో వేధింపులు
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 51 ద్వారా మల్టీపర్పస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రామపంచాయతీల్లో వివిధ రకాల కేటగిరీలన్నిటినీ రద్దు చేసి కలం పట్టిన కారోబార్, బిల్ కలెక్టర్ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ఏ పనైనా చేయాలని బలవంతంగా బాండ్ పేపర్ల పై సంతకాలు చేయించుకుని కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారు. అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేని పరిస్థితుల్లో కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వెనకాడటం లేదు. నైపుణ్యతతో కూడిన ట్రాక్టర్ డ్రైవర్లు లేకపోవడంతో అనేకమంది గ్రామపంచాయతీ సిబ్బందితోనే ట్రాక్టర్లు నడిపించడంతో కార్మికులు ట్రాక్టర్ల ప్రమాదాల వల్ల మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులపై వేధింపులు అక్రమ
తొలగింపులతో పాటు గ్రామాల్లోని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతన్నారు. సొంత అవసరాల కోసం పనులను చేయించుకుంటున్నారు. పనులు చేయకుంటే ఉద్యోగం నుంచి తొలగింపు లాంటి చర్యలను చేపడుతున్నారు.
కార్మికుల డిమాండ్లు ఇవీ..
గ్రామాల్లో గ్రామపంచాయతీ సిబ్బందికి ఏడాదికి మూడు జతల యూనిఫామ్, సరిపడా చెప్పులు, సబ్బులు, నూనెలు, అలవెన్స్ గా నగదు రూపంలో ప్రభుత్వం చెల్లించాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతో పాటు సహజ మరణానికి బీమా పథకాన్ని ఐదు లక్షలకు పెంచి వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలి. ఎనిమిది గంటల పని దినాలని అమలు చేస్తూ, వారాంతపు సెలవులు, పండుగ సెలవులు, జాతీయ ఆర్జిత సెలవుల దినాలను అమలు చేసి కార్మికులను ఆదుకోవాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. ప్రస్తుతం అమలవుతున్న వేతనాలు సమయానికి రాకపోవడంతో కార్మికులు కుటుంబ పోషణతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మూడు నాలుగు నెలలకు ఒకసారి జీతాలు వేయడంతో తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు. మురుగు తీసే కార్మికులకు కనీసం గౌరవం ఉండే విధంగా వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఉద్యమ కార్యచరణతో ప్రజాస్వామ్య సంఘాలు గ్రామ పంచాయతీ కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
బేసిక్ పే జీతాలివ్వాలి
పారిశుధ్య కార్మికులు, స్వీపర్లు పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్ వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా పనులు చేస్తున్నప్పటికీ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయకుండా, కనీసం వారికి ఉద్యోగ భద్రత కల్పించకుండా గత పాలకులు చేసిన నిర్లక్ష్యమే నేటి పాలకులూ అవలంబిస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నది ఇందుకేనా? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి పీఆర్సీ లో నిర్ణయించిన బేసిక్ ప్రకారం రూ. 19,000 లోపు జీవో నెంబర్ 60లో పేర్కొన్న వేతనాలను కేటగిరీల వారీగా అందించాలి. పంచాయతీ సిబ్బందికి రూ. 15,600, కారోబార్, బిల్ కలెక్టర్లకు ఇతర స్కిల్డ్ సిబ్బందికి రూ.9500 చెల్లించాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు అసిస్టెంట్ పంచాయతి కార్యదర్శుల ప్రమోషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మికుల జేఏసీ కోరుతున్నది. కార్మికులు తమ డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
- వేముల గోపీనాథ్, సామాజిక కార్యకర్త