- నష్టపోయిన ప్రతి ఉద్యోగికిన్యాయం చేయాలి
- స్థానికతను పరిగణనలోకి తీసుకొని
- సర్దుబాటు చేయాలని వినతి
- సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన నేతలు
హైదరాబాద్, వెలుగు: గత సర్కారు తెచ్చిన జీవో 317లోని లోపాలను సవరించి ఉద్యోగులకు తమకు న్యాయం చేయాలని ఉద్యోగ జేఏసీ నేతలు సర్కారుకు విజ్ఞప్తి చేశారు. ఆ జీవో లోపభూయిష్టంగా ఉందని ఎంత మొత్తుకున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని.. ఉద్యోగుల నుంచి బలవంతంగా ఆప్షన్లు తీసుకొని బదిలీ చేశారని ఆరోపించారు. శుక్రవారం ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కో చైర్మన్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు సీఎస్ శాంతి కుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సెక్రటేరియెట్ మీడియా పాయింట్లో మాట్లాడారు.ఇటీవల సీఎంతో జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయని, తమ సమస్యలను సీఎం విని, పరిష్కారానికి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా 317 జీవో ద్వారా నష్టపోయిన ఉద్యోగుల ప్రతి దరఖాస్తును పరిశీలించి న్యాయం చేయాలని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసి సర్దుబాటు చేయాలని ఇటీవల మీటింగ్ లో సీఎంను, తాజాగా సీఎస్ ను కోరామని తెలిపారు. ఈ జీవోతో ఉద్యోగులను దూర ప్రాంతాలకు పంపించడం వల్ల వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు.
ఒక్కో శాఖలో ఒక్కో క్యాడర్ ను వివిధ స్థాయిలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో విభజించడం గందరగోళానికి దారి తీసేలా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆ జీవోను సవరించి ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులను వారు కోరుకున్న ప్రాంతాల్లో స్థానికత ఆధారంగా సర్దుబాటు చేసేలా చూడాలని సీఎస్ ను కోరామన్నారు. భవిష్యత్యులో ఉద్యోగాల భర్తీలోనూ సవరించిన 317 జీవోను అమలయ్యేలా చూడాలని, 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగంగా 95% మంది స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. 317 జీవోపై సీఎంకు కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయాలని కోరారు. రిపోర్ట్ లో ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండే అంశాలను అమలు చేయొద్దని సీఎస్ ను కోరామని చైర్మన్ జగదీశ్వర్, కో చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, శనివారం జరిగే కేబినెట్ మీటింగ్‌లో 317 కమిటీ రిపోర్ట్ ను ఆమోదించాక, రిపోర్టును బహిర్గతం చేస్తామని, పబ్లిక్ డొమైన్లో పెడతామని సీఎస్ చెప్పారన్నారు. సీఎస్‌ను కలిసినవారిలో వంగా రవీందర్ రెడ్డి, చావ రవి, సదానందం గౌడ్, మధుసూదన్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘము నేత గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వానికి జోనల్ వ్యవస్థపై అవగాహన లేదు
317 జీవోలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని టీజీ జేఏసీ నేత లచ్చిరెడ్డి సూచించారు. సీఎస్ ను కలిసిన అనంతరం సచివాలయంలోని మీడియా సెంటర్లో మాట్లాడారు. 317 జీవో కారణంగా మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఉద్యోగులు ఎక్కువగా నష్టపోయారన్నారు. తాము సూచించిన అంశాలపై కేబినేట్లో చర్చించాలని సీఎస్‌ను కోరినట్టు తెలిపారు. 2018లో జోనల్ వ్యవస్థపై అవగాహన లేకుండా గత ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చిందన్నారు. ఉద్యోగులను సర్దుబాటు చేసే క్రమంలో తప్పులు జరిగాయన్నారు. భార్యాభర్తలిద్దరినీ ఒకే ప్రాంతానికి సర్దుబాటు చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ నేతలు నిర్మల, హన్మంతరావు, నవాత్ సురేష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.