- ఏజెన్సీలను రద్దు చేసి సర్కారే జీతాలివ్వాలి
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గర్జన సభలో నాయకులు
కరీంనగర్, వెలుగు : మూడేండ్ల సర్వీస్పూర్తి చేసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, లేదంటే నేరుగా సర్కారే.. గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలని తెలంగాణ స్టేట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గర్జన సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 3 వేల మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పులి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అన్ని పనుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కరోనా, వరదల వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తాము కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్లు పనిచేశామని గుర్తు చేశారు. తమ పనిని గుర్తించి వీఆర్ఏలు, ఆర్టీసీ, సెర్ఫ్ఉద్యోగుల్లాగే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఎందరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకుంటున్న ఏజెన్సీ వ్యవస్థని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలకు ఇచ్చే కమీషన్, జీఎస్ టీతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించవచ్చన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఇప్పటివరకు మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. స్టేట్ జేఏసీ నాయకులు సంతోష్, వినోద్, నారాయణ, గోవర్ధన్, జగదీష్, శ్రీధర్, రాజిరెడ్డి పాల్గొన్నారు.