హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగులకు దసరా కానుకగా డీఏలను చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేర కు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని సెక్రటేరియెట్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు కలిసి వినతిపత్రం అందించారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రజాప్రభుత్వంలో దసరా కానుకగా చెల్లిస్తారనే నమ్మకంతో ఉద్యోగులు ఉన్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, జేఏసీ నేత లు కె.రామకృష్ణ, జి.నిర్మల, రమేశ్ పాక పాల్గొన్నారు. కాగా, ఉద్యోగులకు రావాల్సిన డీఏలను దసరా కానుకగా ఇవ్వాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియెట్ (టీఎస్ఎస్ ఏ) అసోసియేషన్ నేతలు కూడా వేం నరేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఓపీఎస్ అమలు చేయాలి
ఉమ్మడి రాష్ట్రంలో 2003లో రిక్రూట్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధా నాన్ని అమలు చేయాలని 2003 ఉద్యోగ, ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ కోరారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని సంఘం రాష్ట్ర నేతలు సంతోష్ కుమార్, వేణుగోపాల్, రవీందర్, పరమేశ్వర్, రామకృష్ణ తదితరులు కలిసి వినతిపత్రం అందించారు.